
- ఇండ్లు, సెల్లార్లలోకి వరద నీరు
- కొట్టుకుపోయిన బైక్‌లు
- బంజారాహిల్స్‌లో 10.15 సెం.మీ. వర్షపాతం నమోదు
- సిటీ అంతటా భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ సిటీలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. నాన్‌స్టాప్‌గా 2 గంటల పాటు కురిసిన వర్షానికి రోడ్లు, కాలనీలు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు హైదరాబాద్ సిటీ అంతటా వాన దంచికొట్టింది. బంజారాహిల్స్ లో అత్యధికంగా 10.15 సెంటీ మీటర్ల వాన పడింది. ఫ్లైఓవర్ల వద్ద నడుంలోతు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాయదుర్గం నుంచి టోలిచౌకి వైపు షేక్ పేట్ ఫ్లై ఓవర్ ని ఒకవైపు క్లోజ్ చేశారు. రోడ్లపై చేరిన నీటిని హైడ్రా సిబ్బంది మోటార్లతో తొలగించింది.
కృష్ణా నగర్‌లోని పలు కాలనీల్లో బైకులు కొట్టుకుపోయాయి. అమీర్ పేట్ లో కారు ఇంజన్ లోకి నీరు పోవడంతో రోడ్డుపైనే ఆగిపోయింది. పోలీసులు ఆ కారుని పక్కకి నెట్టి.. ట్రాఫిక్ క్లియర్ చేశారు. మెహిదీపట్నం అయోధ్య జంక్షన్‌లోని మెహదీ ఫంక్షన్ హాల్‌లో నీరు నిలిచింది. ఆఫీసుల నుంచి ఇండ్లకు వెళ్లే టైమ్‌లోనే వర్షం కురవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో జనం తీవ్ర ఇబ్బందికి గురయ్యారు.
ఐటీ కారిడార్‌లో..
ఐటీ కారిడార్‌లోని మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, చందానగర్, మియాపూర్ ప్రధాన చౌరస్తాలు, సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. ఐటీ ఉద్యోగులు అంతా కార్లలోనే ఆఫీస్‌కు బయలుదేరడంతో ప్రతి రోజు ఉండే రద్దీ కంటే అధికంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జేఎన్టీయూ నుంచి సైబర్ టవర్స్ మీదుగా ఐకియా, బయోడైవర్సిటీ జంక్షన్ వైపు, రాయదుర్గం నుంచి బయో డైవర్సిటీ వైపు, అల్విన్ చౌరస్తా నుంచి కొండాపూర్ జంక్షన్, జూబ్లీహిల్స్ నుంచి సైబర్ టవర్స్ వైపు, బొటానికల్ గార్డెన్ నుంచి గచ్చిబౌలి, విప్రో జంక్షన్, ఐఐఐటీ జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంది. దీనికితోడు గచ్చిబౌలి నుంచి కొండాపూర్ రూట్లో ట్రాఫిక్ డైవర్షన్ ఉండడంతో రద్దీ మరింత పెరిగింది. లాగౌట్ లు ఒకేసారి కావడంతో కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచాయి. ఉద్యోగులు ఇండ్లకు చేరకునేందుకు అర్ధరాత్రి అయింది.
దేవరకొండ బస్తీలో మేయర్, హైడ్రా కమిషనర్ పర్యటన
నాలా పొంగడంతో వేంకటేశ్వర కాలనీ డివిజన్ లోని దేవరకొండ బస్తీ నీట మునిగింది. బస్తీ వాసుల ఇండ్లలోకి నీళ్లు వచ్చాయి. సమాచారం అందుకున్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ తో కలిసి ముంపు ప్రాంతాలను పరిశీలించారు. బాధితులతో మాట్లాడి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నాలా పూడికతీత పనులను చేపట్టాలని జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులకు మేయర్ సూచించారు. అనంతరం మేయర్ కేబీఆర్ పార్క్ వద్ద మేజర్ లాగింగ్ పాయింట్ లను పరిశీలించారు. శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు మేయర్ సూచించారు.
ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్స్
ఖైరతాబాద్ నుంచి కూకట్ పల్లి, సికింద్రాబాద్ నుంచి బేగంపేట, హైటెక్ సిటీ నుంచి లింగంపల్లి, రాయదుర్గం నుంచి మెహిదీపట్నం, కోఠి నుంచి ఎల్బీనగర్ వరకు ఇలా చాలా చోట్ల కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే బేగంపేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, లక్డీకాపూల్, పంజాగుట్ట, హైటెక్ సిటీ, టోలీచౌకీ, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, మెహిదీపట్నం, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది.
మెహిదీపట్నం నుంచి టోలీచౌకీ, బయో డైవర్సిటీ, గచ్చిబౌలీ రూట్‌లో కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో నానక్‌రామ్‌గూడ, నార్సింగి, లంగర్‌హౌజ్ మీదుగా ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, రాయదుర్గం నుంచి వచ్చే వెహికల్స్‌ను వివిధ మార్గాల్లో దారి మళ్లించారు.