
హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. గురువారం (మే 29) ఉదయం నుంచి మబ్బులు కమ్ముకుని పొడిగా ఉన్న వాతావరణం సాయంత్రం ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన మేఘాలతో చల్లని గాలులతో ఒక్కసారిగా ఛేంజ్ అయ్యింది. సాయంత్రం 5 గంటల తర్వాత వర్షం ప్రారంభమైంది.
ఉప్పల్ ఏరియాలో భారీ వర్షం కురుస్తోంది. ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ ప్రాంతాలలో ఉన్నట్లుండి వాన ఊపందుకుంది. అదే విధంగా తార్నాక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్ ఏరియాల్లో కూడా వర్షం కురుస్తోంది.
సికింద్రాబాద్ ప్రాంతంలో కూడా వర్షం ప్రారంభమైంది. సికింద్రాబాద్, పరేడ్ గ్రౌండ్స్ ఏరియాల్లో వర్షం కురుస్తుండటంతో ట్రాఫిక్ జాం అయ్యింది.
కుత్భుల్లాపూర్ ప్రాంతంలో కూడా వాన దంచికొడుతోంది. సుచిత్ర ఏరియాలో కురుస్తున్న వర్షానికి వాహనదారులు బైకులను ఆపి షాపుల వద్ద తలదాచుకుంటున్నారు.
ఒక్కొక్క ఏరియా నుంచి మెల్ల మెల్లగా సిటీ మొత్తం వ్యాపిస్తోంది వాన. దిల్ సుఖ్ నగర్ లో కూడా భారీ వర్షం కురుస్తోంది. చైతన్యపురి, కొత్తపేట ఏరియాల్లో వర్షం పడుతోంది.
వానాకాలానికి ముందే నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం (మే 28) తెలంగాణ మొత్తం వ్యాపించిన నైరుతి రుతుపవనాలు.. ఛత్తీస్ గఢ్, ఒడిస్సాలోని కొన్ని ప్రాంతాల్లోకి వ్యాపించాయి.
ఇవాళ (మే 29) హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే ఛాన్స్ ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ కేంద్రం ప్రకటించింది. అన్నట్లుగానే సాయంత్రం ఒక్కసారిగా హైదరాబాద్ లో వాన జోరందుకుంది.