హైదారాబాద్ లో పలు చోట్ల జోరు వాన.. భారీగా ట్రాఫిక్ జాం

హైదారాబాద్ లో పలు చోట్ల జోరు వాన.. భారీగా ట్రాఫిక్ జాం

హైదారాబాద్ లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. గత కొన్నిరోజులుగా నగరంలో వర్షం పడుతూనే ఉంది. ఈ క్రమంలో మే 4వ తేదీ గురువారం సాయంత్రం ఒక్కసారిగా జోరువాన అందుకుంది. జూబ్లీ హీల్స్, మాదాపూర్ ఫిలింనగర్, పంజాగుట్ట, గచ్చిబౌలి, మణికొండ, శేరిలింగం పల్లి, పటాన్ చెరు, మెహిదీపట్నం కొండాపూర్, కేపీహెచ్ బీ, లింగంపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిస్తోంది. భారీ వర్షానికి నగరంలో ఉన్న నాలాలు, చెరువులు పొంగి పొర్లాయి. రోడ్లన్నీ జలయయం అయ్యాయి. దీంతో నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ జాం అయ్యింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కురుస్తోంది. అకాల వర్షానికి రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. పంట చేతికొచ్చి ధాన్యం కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న సమయంలో వాన కురవడంతో ధాన్యం తడిసిముద్దైంది. అటు కోతకు సిద్ధంగా ఉన్న పంటతో పాటు కొనుగోలుకు తరలించిన ధాన్యం వర్షార్పణమవుతోంది. మరోవైపు మొక్కొజన్న, మామిడి, మిర్చి, ఇతర పంటలు వర్షాలకు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.

ఈ నేపథ్యంలో రైతన్నకు ‘మోచా’ తుఫాను రూపంలో మరో ముప్పు పొంచి ఉంది. ఈమేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పిన వాతావరణ శాఖ.. మరో 3 రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవ కాశం ఉందని హెచ్చరించింది. 6వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడుతుందని పేర్కొంది. అది బలపడి 7న అల్పపీడనంగా మారుతుందని, 8న మరింత బలపడి తీవ్ర అల్ప పీడనంగా మారుతుందని హెచ్చరించింది. మరుసటి రోజు అది తీవ్రమై తుఫానుగా మారే చాన్స్ ఉందని తెలిపింది.