వదలని వాన..నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు

వదలని వాన..నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు నెట్​వర్క్: రాష్ట్రంలో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు జనగామ జిల్లాలోని ఘన్‌‌‌‌పూర్‌‌‌‌లో 9 సెంటీమీటర్లు, నల్గొండలోని పెద్ద అడిశర్లపల్లిలో 7, మర్రిగూడలో 7, కరీంనగర్ టౌన్ లో 7, దేవరకొండలో 5, మహబూబాబాద్‌‌‌‌లోని గార్లలో 6, జయశంకర్‌‌‌‌ భూపాలపల్లిలోని వెంకటాపురంలో 6, ఖమ్మంలోని కొనిజెర్ల, చింతకంలలో 5, కూసుమంచిలో 4, మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌లోని జడ్చర్లలో 5, నిర్మల్‌‌‌‌లోని ముథోల్‌‌‌‌లో 4, రంగారెడ్డిలోని హయత్‌‌‌‌ నగర్‌‌‌‌లో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.

ఇయ్యాల భారీ వానలు

సోమవారం రాష్ట్రంలోని కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌‌‌‌ వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్- అర్బన్‌‌‌‌, వరంగల్-రూరల్‌‌‌‌, మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది. మంగళవారం చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఆదివారం ఉదయం 5.30కు అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది.

అప్రమత్తంగా ఉండండి: సీఎస్‌‌‌‌

రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిందని సీఎస్‌‌‌‌ సోమేశ్ కుమార్‌‌‌‌ తెలిపారు. వర్షాలతో చెట్లు, ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.

మేడిగడ్డకు మళ్లీ భారీ ఇన్ ఫ్లో

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన లక్ష్మి (మేడిగడ్డ) బ్యారేజీకి ఈ సీజన్ లోనే రెండోసారి భారీ వరద కొనసాగుతోంది. మేడిగడ్డ బ్యారేజీకి ఆదివారం 2 లక్షల70 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. దీంతో బ్యారేజీలో 46 గేట్లను ఎత్తి 2 లక్షల 55 వేల 217 క్యూసెక్కులను  భద్రాచలం వైపు వదులుతున్నారు.

ఎస్సారెస్పీ నుంచి 32 గేట్ల ద్వారా..

ఎస్సారెస్పీ లోకి ఎగువ ప్రాంతం నుంచి లక్షా 46 వేల 874 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో 32 క్రస్ట్​గేట్ల ద్వారా 1.25 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరి లోకి వదులుతున్నారు.

సాయం ఇవ్వకున్నా పర్వాలే.. 
ఇట్ల మళ్లీ జరగకుండా చూడండి

వలిగొండ: ‘‘మాకు పంట నష్టం జరిగిందని పరిహారం ఇవ్వకున్నా పర్వాలేదు.. కానీ భవిష్యత్‌‌‌‌లో మరోసారి ఇలా జరగకుండా చూడండి. రైతు పండించిన పంటనే తింటూ.. వారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ పట్టించుకోరు’’ అని ఓ రైతు బిడ్డ ఆవేదన వ్యక్తం చేశాడు. తన పొలంలో పీకల్లోతు వరద నీటిలో నిలబడి పరిస్థితిని వివరించాడు. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం అరూరుకు చెందిన దోతి ఐలయ్య, చంద్రమ్మ 6 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. భారీ వర్షాల వల్ల పంట మొత్తం నీట మునిగి చెరువును తలపిస్తోంది. దీంతో వారి కొడుకు వరుణ్.. తమ పొలంలో వరద నీటిలో నిలబడి సమస్యను ఆఫీసర్ల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌‌‌‌ మీడియాలో వైరల్‌‌‌‌గా మారింది. ఎగువ నుంచి వచ్చే వరదతో తమ పొలం మొత్తం నీట మునిగిందని అతడు చెప్పాడు. నీళ్లు దిగువకు వెళ్లేందుకు సరైన తూములు లేకపోవడంతో రోజుల తరబడి పొలంలో నీరు నిలిచిపోతుందని చెప్పాడు.

కరీంనగర్‌‌లో దంచి కొట్టింది

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కరీంనగర్​లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. ముకరంపుర నుంచి వెళ్లే పెద్ద నాలా పొంగి ప్రవహిస్తోంది. కలెక్టరేట్ వద్ద భారీగా నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నల్గొండ జిల్లా చండూరు, దేవరకొండ, నల్గొండ, నకిరేకల్‌‌‌‌తో పాటు, యాదాద్రి జిల్లా భువనగిరి, వలిగొండ, ఆలేరులో 2 గంటల పాటు కురిసిన వర్షానికి రోడ్లన్నీ కాలువలను తలపించాయి. వలిగొండలోని వర్కట్‌‌‌‌పల్లి చెరువు పంట కాలువకు గండి పడడంతో కిందున్న పొలాలు నీట మునిగాయి. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో సాయంత్రం భారీ వర్షం కురిసింది.  నేషనల్‌‌‌‌ హైవే పక్కనున్న పంచాయతీరాజ్‌‌‌‌ సబ్‌‌‌‌ డివిజన్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ చుట్టూ నీళ్లు చేరాయి.

అందరూ చూస్తుండగానే..వరదలో కొట్టుకుపోయాడు

హైదరాబాద్‌‌‌‌ సరూర్‌‌‌‌ నగర్‌‌‌‌లో ఘటన

చిన్నారి సుమేధ విషాద ఘటన మరువక ముందే హైదరాబాద్​ వరదల్లో మరో వ్యక్తి కొట్టుకుపోయాడు. అందరూ చూస్తుండగానే నీళ్లలో మునిగిపోయాడు. అల్మాస్​గూడకు చెందిన ఎలక్ట్రీషియన్​ నవీన్‌‌ కుమార్‌‌‌‌ (39)  ఆదివారం రాత్రి 7 గంటలకు సరూర్‌‌‌‌నగర్​లోని ఓ ఇంట్లో ఎలక్ట్రీషియన్​ పనులు ముగించుకొని తపోవన్​ కాలనీ మీదుగా నడుచుకుంటూ ఇంటికి బయలుదేరాడు. అప్పటికే కురిసిన వర్షానికి తపోవన్​ కాలనీ వద్ద నాలాలు పొంగి రోడ్డుపై వరద ప్రవహిస్తోంది. దీంతో అందరితో పాటు నవీన్​ రోడ్డుపక్కన ఆగాడు. ఇంతలో వరద నీటిని దాటుకుంటూ ఓ ట్రాక్టర్​ ముందుకు వెళ్లగా.. దాని వెనకే స్కూటీపై ఇద్దరు వ్యక్తులు వరదను దాటేందుకు ప్రయత్నించగా మధ్యలో స్కూటీ ఆగిపోయింది. స్కూటీని నెట్టేందుకు నవీన్​ ప్రయత్నించి నీటిలో జారిపడ్డాడు. అక్కడి వాళ్లు  కాపాడేందుకు ప్రయత్నించే లోపే సరూర్‌‌‌‌నగర్‌‌‌‌ చెరువులోకి కొట్టుకుపోయాడు.  4 రెస్క్యూ టీమ్​లు  బోట్స్​ సాయంతో గాలింపు చర్యలు చేపట్టాయి. రాత్రి కావడంతో రెస్క్యూ ఆపరేషన్​కు సమస్యలు ఎదురయ్యాయి. గురువారం సాయంత్రం నేరేడ్​మెట్  దీన్​దయాల్​నగర్​లో ఆడుకునేందుకు బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న 11 ఏండ్ల సుమేధ ఓపెన్​ నాలాలో జారి పడి మరుసటి రోజు బండ చెరువులో శవమై తేలింది. శనివారం సాయంత్రం చంపాపేట్​లో వరద నీటికి ఓ కాలు కొట్టుకొచ్చింది.