కుండపోతతో అతలాకుతలం

కుండపోతతో అతలాకుతలం
  • వాగుల వద్ద పోలీసుల పహారా
  • ప్రాజెక్టుల్లోకి వరద పోటు

నిర్మల్/భైంసా/బాసర/కాగజ్​నగర్,వెలుగు : ఉమ్మడి జిల్లాను వర్షం వీడడంలేదు. నిర్మల్​లో రెండ్రోజులుగా కురుస్తున్న వాన అతలాకుతలం చేసింది. సారంగపూర్ మండలంలోని బీరవెల్లి - వంజర బ్రిడ్జిపై నుంచి నీరు పొంగి ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు చోట్ల వాగులు పొంగిపొర్లుతుండడంతో పోలీసులు వెహికల్స్​ రాకపోకలను నియంత్రిస్తున్నారు. దోనిగామ వాగులో ఓ వ్యక్తి వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. అదృష్టవశాత్తు ఓ చెట్టును పట్టుకోగా, స్థానికులు అతనిని వరద నీటి నుంచి బయటకు తెచ్చారు. కడెం, గడ్డెన్న వాగు, స్వర్ణ ప్రాజెక్టుల్లోకి వరద పోటెత్తుతోంది. కడెంలో మంగళవారం సాయంత్రం నాటికి 38,822 క్యూసెక్కుల ఇన్​ఫ్లో ఉండగా, 18,014 క్యూసెక్కుల ఔట్​ఫ్లో ఉంది. స్వర్ణ ప్రాజెక్టులోకి 30 వేల క్యూసెక్కులు ఇన్​ఫ్లో ఉండగా,  ఔట్​ఫ్లో 30 వేల క్యూసెక్కులు ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ఆయా గ్రామాల వారిని ఆఫీసర్లు అప్రమత్తం చేశారు. నిర్మల్​లోని జీఎన్​ఆర్​ కాలనీ వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. భైంసా గడ్డెన్న ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వస్తోంది. ప్రాజెక్టు కింద ఫ్లడ్​ బ్యాంకులు కొట్టుకుపోయాయి. 18 వేల క్యూసెక్కుల నీరు ఇన్​ ఫ్లో  ఉండగా,  20 వేల క్యూసెక్కులు ఔట్​ఫ్లో ఉంది. జిల్లాలో 16.6 సెం.మీ వర్షపాతం నమోదు కాగా.. బాసరలో 91 మి.మీ వర్షపాతం నమోదైంది. బాసరతో పాటు నిర్మల్​, భైంసా, ఖానాపూర్​ పట్టణాల్లోని పలు లోతట్టు ప్రాంతాలలో వాననీరు చేరింది. 

బతికి బయట పడ్డాడు..

సారంగాపూర్​ మండలం వైకుంఠపూర్​లోని వరద కాలువలో చిక్కుకొని నీటి ఉధృతికి కొట్టుకుపోయిన లస్మన్న అనే రైతు బతికి బయటపడ్డాడు. వ్యవసాయ పనుల కోసం వెళ్లిన లస్మన్న ప్రమాదవశాత్తు నీటిలో చిక్కుకోగా.. వరద నుంచి కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించారు. వరదలో కొట్టుకుపోతున్న లస్మన్న ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ చెట్టునుపట్టకున్నాడు. దీంతో గ్రామస్తులు ఆయనను రక్షించారు. 

 

రైల్వే స్టేషన్​, రవీంద్రపూర్ కాలనీల్లో వరద నీరు
బాసర మండల కేంద్రం మళ్లీ జలమయమైంది. రైల్వేస్టేషన్, రవీంద్రనగర్​కాలనీ నీట మునిగింది. సుమారు 12 ఇండ్లు నీటమునిగాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లాలోని చింతల మానేపల్లి మండలం ఆడెపల్లి గ్రామానికి చెందిన పారుపల్లి శంకరక్క  ఇంటి గోడ కూలింది. ఆరు గంటలకుపైగా బాధితులు ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్ల యజమానులు ఆందోళనకు గురయ్యారు. మీడియాలో వార్తలు వచ్చేవరకూ ఆఫీసర్లు స్పందించలేదు. తర్వాత మరబోట్లు తెచ్చి వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 
బాసర నుంచి నయాగావ్​ వెళ్లే మార్గంలో వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

 

 

ఉగ్ర గోదావరి...
ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో బాసర వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. బాబ్లీ ప్రాజెక్టు మీదుగా, బాసర చుట్టు పక్కల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు గోదావరి నదిలోకి చేరింది. పుష్కర ఘాట్లను తాకుతూ, బ్రిడ్జికి చేరువలో వరద ప్రవాహం కొనసాగింది.