ములుగు/ భద్రాద్రికొత్తగూడెం, వెంకటాపురం, వెలుగు : ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కురిసిన మోస్తరు నుంచి భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ములుగు జిల్లాలో సగటున 7.66 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, వాజేడు 11.2 సెం.మీ., వెంకటాపురం 11 సెం.మీ., వెంకటాపూర్ 10.8 సెం.మీ., ఏటూరునాగారం, మల్లంపల్లి, గోవిందరావుపేట మండలాల్లో అధిక వర్షం కురిసింది. ఏటూరునాగారం మండలంలోని జంపన్నవాగు, వాజేడు మండలం చీకుపల్లి–గొల్లగూడెం సమీపంలోని ఇసుకవాగుపై నిర్మాణంలో ఉన్న వంతెనల వద్ద తాత్కాలిక డైవర్షన్ రోడ్లు వరద ఉధృతికి కొట్టుకుపోవడంతో తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.
దీంతో సుమారు 25 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. ఏటూరునాగారం ఏఎస్పీ మన్భట్, వెంకటాపురం సీఐ ముత్యం రమేశ్ ఆ రోడ్డును పరిశీలించారు. ఏఎస్పీ ఆదేశాల మేరకు రాత్రి వరకు తాత్కాలిక రహదారి మరమ్మతులు చేశారు. కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ దమ్మపేట, చుంచుపల్లి, చంద్రుగొండ, టేకులపల్లి, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. అయితే ఈ వర్షాలు వానాకాలం సాగుకు సిద్ధమవుతున్న రైతులకు కొంత ఊరటనిచ్చాయి.
