భారీ వానల ఎఫెక్ట్: అధికారులంతా అలర్ట్.. 24 గంటలూ డ్యూటీలో హైడ్రా... ఫీల్డ్లోనే అన్ని శాఖల ఆఫీసర్లు

భారీ వానల ఎఫెక్ట్: అధికారులంతా అలర్ట్.. 24 గంటలూ డ్యూటీలో  హైడ్రా... ఫీల్డ్లోనే అన్ని శాఖల ఆఫీసర్లు
  • కంట్రోల్​ రూమ్స్​ ఏర్పాటు చేసి పర్యవేక్షణ
  • ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు 
  • ట్రాఫిక్, కరెంట్​ సమస్యలు రాకుండా యాక్షన్​
  •  ఐఎండీ హెచ్చరికతో అప్రమత్తం 

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్ ​పరిధిలో వాతావరణ శాఖ ఆరెంజ్, రెడ్ అలర్ట్​ జారీ చేయడంతో అన్ని శాఖల ఉన్నతాధికారులు అలర్టయ్యారు. వర్షం కురిసినప్పుడు ఇంతకుముందు తలెత్తిన ఇబ్బందులు రిపీట్​కాకుండా అందరూ ఫీల్డ్​లోనే ఉన్నారు. కంట్రోల్ ​రూమ్స్​ఏర్పాటు చేసి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. రోడ్లపై వరద నిలవకుండా, ట్రాఫిక్​ఇబ్బందులు తలెత్తకుండా, డ్రెయిన్స్, డ్రైనేజీలు పొంగకుండా, వాటర్​లాగింగ్​పాయింట్ల వద్ద సమస్యలు ఏర్పడకుండా ఆయా శాఖల అధికారులు పక్కా ప్లాన్​తో ముందుకెళ్లారు. బల్దియా, హైడ్రా, ట్రాఫిక్ పోలీస్, కలెక్టరేట, వాటర్​బోర్డు, విద్యుత్​బృందాలు సమన్వయంతో పని చేశాయి. 

బల్దియాలో కంట్రోల్​ రూమ్​

బల్దియా ఆఫీసులో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్​ఏర్పాటు చేసి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించారు. అధికారులకు సెలవులు రద్దు చేశారు. కమిషనర్ ​కర్ణన్​తో పాటు జోనల్, సర్కిల్, వార్డుల్లో సంబంధిత జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, వార్డు అధికారులు ఫీల్డ్​లోనే ఉన్నారు. వాటర్​ లాగింగ్​పాయింట్ల వద్ద చేరిన నీటిని తొలగించారు.  

24 గంటలూ డ్యూటీలో  హైడ్రా 

హైడ్రా సిబ్బంది కూడా 24 గంటలూ డ్యూటీలోనే ఉన్నారు. ఎప్పటికప్పుడు క్యాచ్​పిట్, కల్వర్టుల్లో చెత్తను తొలగిస్తూ వరద సాఫీగా సాగేలా పని చేస్తున్నాయి. నగర వ్యాప్తంగా 436 ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉందని గుర్తించిన హైడ్రా.. 150 ప్రాంతాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించింది. ఈ ప్రాంతాలతో పాటు మరో142 ఏరియాల్లో హెవీ మోటార్లు పెట్టి వరద సాఫీగా వెళ్లేలా చూసింది. కొద్దిపాటి సమస్య ఉండే 144 ప్రాంతాలను గుర్తించి వరద ముంచెత్తకుండా చర్యలు తీసుకుంది. 51హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగగా, 150 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్​పని చేశాయి. 

మొత్తంగా 3,565 మంది 9 బోట్లను సిద్ధం చేసుకుని డ్యూటీల్లో ఉన్నారు. అలాగే,  309 ప్రాంతాలపై హైడ్రా నిఘా పెట్టింది. వీరికి తోడు మరో 20 టీమ్స్​ ట్రాఫిక్ పోలీసులతోఉంటూ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చెట్లు పడిపోతే తొలగించేందుకు స్పెషల్​ టీమ్స్​తో పాటు ట్రాఫిక్​జామ్​లో సులభంగా వెళ్లేందుకు 21 టీమ్స్​ పని చేశాయి.  212 డీవాటరింగ్ పంపులను నీరు నిలిచే ప్రాంతాల్లో అందుబాటులో ఉంచారు. హైడ్రా చీఫ్​ రంగనాథ్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. అడిషనల్​డైరెక్టర్​ వర్ల పాపయ్య హైడ్రా కంట్రోల్ రూమ్​తో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఫీల్డ్​లెవెల్​లో సిబ్బందిని అప్రమత్తం చేశారు.  

విద్యుత్ శాఖ అప్రమత్తం

కరెంట్​సమస్యలు రాకుండా సిబ్బందికి దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సెలవులు రద్దు చేసింది. ఇంజినీర్లు, సిబ్బంది 24 గంటలు హెడ్ క్వార్టర్ లో ఉండాలని సీఎండీ ముషారఫ్​ఫరూఖీ ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానల్లో విద్యుత్ సరఫరా పర్యవేక్షణ కోసం 24 గంటలు అందుబాటులో ఉండేలా ఓఅండ్​ఎం సిబ్బందిని నియమించారు. 213 సెక్షన్ ఆఫీసులకు చెందిన ఫ్యుజ్ కాల్ ఆఫీసుల్లో జీపీఎస్​ ఆధారంగా పని చేసే అత్యాధునిక ఆటోలు, అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు వీలుగా విద్యుత్ అంబులెన్సు తరహాలో 167 ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం వాహనాలు, సరిపడా సిబ్బందిని అందుబాటులో ఉంచారు. 

బుధవారం హుస్సేన్​సాగర్ ​సబ్ స్టేషన్​ను ముషారఫ్​ సందర్శించారు. పలు అపార్ట్​మెంట్​ సెల్లార్లలో నీళ్లు చేరి మీటర్లు ఉన్న ప్యానల్ బోర్డును తాకే అవకాశముందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యుత్ ​సమస్యలపై1912కి గానీ, స్థానిక ఎఫ్​ఓసీకు ఫిర్యాదు చేయాలన్నారు. 

మూసీలోకి ఎవరూ దిగొద్దు: కలెక్టర్ హరిచందన

మెహిదీపట్నం: మూసీ నదిలో వరద ఉధృతి పెరగడంతో పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన సూచించారు. బుధవారం లంగర్ హౌస్​లోని బాపూ ఘాట్ వద్ద అదనపు కలెక్టర్ జి. ముకుంద రెడ్డితో కలిసి మూసీ నది ప్రవాహాన్ని ఆమె పరిశీలించారు. జీహెచ్‌ఎంసీ, హైడ్రా, పోలీసు అధికారులతో కలిసి పనిచేయాలని అధికారులకు సూచించారు. ప్రజలు నదిలోకి దిగవద్దని హెచ్చరించారు. 

రంగంలోకి ట్రాఫిక్​ జాయింట్​ సీపీ 

బషీర్​బాగ్​: వర్షంతో రోడ్లపై నీరు నిలిచిపోవడం, ట్రాఫిక్​ జామ్స్​తో వాహనదారులు ఇబ్బందులు పడకుండా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. పలు ప్రాంతాల్లో సహాయక బృందాలను నియమించారు. మసాబ్​ట్యాంక్ నుంచి లక్డీకాపూల్ ​వెళ్లే మార్గంలో రోడ్డుపై నీరు నిలవడంతో ట్రాఫిక్​ నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ రంగంలోకి దిగారు. డీసీపీ  శ్రీనివాస్​తో కలిసి ట్రాఫిక్ క్లియర్ చేశారు. 

క‌‌‌‌లుషిత నీరు, సీవ‌‌‌‌రేజీపై వాటర్​బోర్డు దృష్టి

వాటర్ ​బోర్డు సిబ్బంది జీహెచ్ఎంసీ, హైడ్రా గుర్తించిన 141 నీరు నిలిచే హాట్‌‌‌‌స్పాట్లను పర్యవేక్షించింది. మ్యాన్‌‌‌‌హోల్స్ ​ఉప్పొంగితే వెంట‌‌‌‌నే పూడిక‌‌‌‌తీత ప‌‌‌‌నులు చేపట్టారు. మ్యాన్‌‌‌‌హోళ్ల నుంచి తీసిన‌‌‌‌ వ్యర్థాల‌‌‌‌ను వెంట‌‌‌‌నే తరలిస్తున్నారు. తాగునీరు స‌‌‌‌ర‌‌‌‌ఫ‌‌‌‌రా అయ్యే టైంలో మంచినీటి నాణ్యత‌‌‌‌ను పరీక్షించారు. వాటర్​బోర్డు ఎండీ అశోక్ రెడ్డి హెడ్డాఫీసు నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించారు.