పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. సిటీలో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పలు జిల్లాల్లో పంటలు నీటమునిగాయి. మరికొన్ని జిల్లాల్లో ఇళ్లల్లోకి వరద నీరు చేరుతోంది. మరో రెండు రోజులు పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 

హైదరాబాద్ సహా జిల్లాల్లో వర్షాలు

హైదరాబాద్ సహా జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, నాంపల్లి, కోఠి, గచ్చిబౌలి, ఎల్బీనగర్, మలక్ పేట్ తో పాటు సిటీ శివారు ఏరియాల్లోనూ వర్షం పడింది. మరో రెండు రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరటంతో.. నాగోల్ అయ్యప్ప నగర్ కాలనీ, మీర్ పేట్ లోని MLR కాలనీల్లో పరిస్థితి దారుణంగా ఉంది. నిత్యవసర వస్తువులు తడిసిపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షంతో జంట జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లు నిండుకుండలా మారాయి.

జిల్లాల్లో దంచికొట్టిన వర్షం

జిల్లాల్లోనూ వర్షం దంచికొట్టింది. పాలమూరులో వర్షం తగ్గినా వరద ఉధృతి మాత్రం తగ్గలేదు.  రోడ్లపై నీళ్ళు ఏరులుగా పారుతున్నాయి. పంటలు నీట మునిగాయి. వర్షంతో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరాయి. వరద కాలనీల్లో ఉంటున్న జనం బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో కుండపోత వర్షం కురిసింది. దీంతో జెర్రిపోతుల మైసమ్మ కాలువ బ్రిడ్జి కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. వరదలతో బుద్ధారం, గోపాల్ పేట నుంచి వనపర్తికి రాకపోకలను నిలిచిపోయాయి. నారాయణపేట జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోయిలకొండ చెరువు మత్తడి పోస్తోంది. 

ప్రాజెక్టులకు పోటెత్తిన వరద

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది.అధికారులు ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి, తాడూరు, నాగర్ కర్నూల్ మండలాల్లో భారీ వర్షం కరిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బిజినపల్లి మండలం మహాదేవుని పేటలో ఇళ్లలోకివర్షపు నీరు చేరింది. 

పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

వికారాబాద్ జిల్లా కొడంగల్ లో భారీ వర్షం కురిసింది. బాలాజీ నగర్, కుమ్మరివాడలో ఇళ్లలోకి మురికి నీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట పొలాల్లోకి భారీగా వరద చేరింది. భారీ వర్షానికి కోకట్ వాగు పొంగిపొర్లుతోంది. తాండూరు–ముద్దాయ్ పేట్ మధ్య ఉన్న బ్రిడ్జిపై నుంచి ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. ఇప్పటికే ప్రాజెక్టులు నిండటంతో ఎగువ నుంచి వస్తున్న నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేశారు.