
- బంగాళాఖాతంలో అల్పపీడనం..
- ఇవాళ (అక్టోబర్ 22) వాయుగుండంగా బలపడే అవకాశం..
- ఇప్పటికే పలు జిల్లాల్లో మొదలైన వాన
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో రాబోయే 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం (అక్టోబర్ 20) బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. మంగళవారం (అక్టోబర్ 21) ఉదయానికి బలపడిందని పేర్కొన్నది. ఆ తీవ్ర అల్పపీడనం బుధవారం (అక్టోబర్ 22) నాటికి వాయుగుండంగా మరింత బలపడి పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది .
దాని ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. అయితే, తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. వారం పదిరోజులుగా రాష్ట్రంలో పొడివాతావరణం ఉండగా.. మంగళవారం ఉదయం నుంచి మారిపోయింది.
మబ్బులు పట్టి జల్లులు కురిశాయి. నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ఖమ్మం, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, మహబూబ్‌నగర్, వికారాబాద్, హైదరాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా యాచారంలో 3.9 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండలో 3.7 సెంటీ మీటర్లు, యాదాద్రి జిల్లా నారాయణపూర్‌లో 3.6, నల్గొండ జిల్లా నిడమనూరులో 3.5, యాదాద్రి జిల్లా వలిగొండలో 3.3, నాగర్‌కర్నూల్ జిల్లా సిర్సనగండ్లలో 3.1, నిర్మల్ జిల్లా విశ్వనాథ్‌పేటలో 3, గద్వాల్ జిల్లా రాజోలిలో 3 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్ సిటీలోనూ ఎల్బీ నగర్, హయత్‌నగర్, చాంద్రాయణగుట్ట, సికింద్రాబాద్, బేగంగపేట, చందానగర్, కూకట్పల్లి, యూసుఫ్‌గూడ, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి.
హస్తినాపురంలో అత్యధికంగా 2.5 సెంటీ మీటర్లు, వనస్థలిపురంలో 2.3 సెంటీమీటర్లు, మెట్టుగూడలో 1.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. రాబోయే రెండు రోజుల పాటు సిటీలోనూ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.