ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దంచి కొట్టిన వానలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దంచి కొట్టిన వానలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం వడగండ్ల వాన కురిసింది. సిరిసిల్ల జిల్లా వేములవాడ, చందుర్తి, రుద్రంగి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్,​ బోయినిపల్లి, జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలాల్లో వడగళ్ల వానతో పంటలు దెబ్బతిన్నాయి. మామిడి కాయలు నేలరాలాయి. కరీంనగర్​జిల్లా చొప్పదండి, రామడుగు, గంగాధర, కొత్తపల్లి, కరీంనగర్​ రూరల్ మండలాల్లో వడగండ్ల వర్షంతో వరి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. వీణవంక మండలం కొండపాక గ్రామంలో ఓ ఇంటిపై చెట్లు కూలాయి. ఇదే గ్రామంలో  బుచ్చయ్య, అంగిడి తిరుపతి ఇళ్ల రేకులు పగిలాయి. బ్రాహ్మణపల్లి గ్రామంలో గాజుల పోశయ్య  ఇంటిపై తాటి చెట్టు కూలింది.

వండగండ్లతో హిమ్మత్ నగర్ కు చెందిన జొన్నల కొమురయ్య తలకు గాయమైంది. ఇల్లందకుంట మండలంలో  ఇల్లందకుంట, సిరిసేడు, బూజునూరు, సీతంపేట తదితర గ్రామాల్లో బలమైన గాలులు, ఉరుములతో కూడిన వాన కురిసింది. పిడుగుపాటుకు విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి జిల్లాలోని జమ్మికుంట, వీణవంక మండలాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్​ చేశారు. - వెలుగు నెట్​వర్క్