అర్థరాత్రి కుండపోత..రోడ్లన్నీజలమయం

అర్థరాత్రి కుండపోత..రోడ్లన్నీజలమయం

గ్రేటర్ హైదరాబాద్ లో  రాత్రి కురిసిన భారీ వర్షానికి  రోడ్లపై వరద పోటెత్తింది. నాలాలు పొంగిపొర్లటంతో కాలనీలు, రోడ్లు చెరువులుగా మారాయి. లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. దీంతో ఇళ్లలోకి భారీగా నీళ్లు చేరటంతో జనం అవస్థలు పడ్డారు. వర్షానికి చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అర్ధరాత్రి మూడు గంటల దాకా ఎడతెరిపి లేకుండా వర్షం పడింది.

గుడిమల్కాపూర్ లో 14.8 సెం.మీ భారీవర్షం కురిసింది. సికింద్రాబద్ మోండా మార్కెట్, శివరాంపల్లిలో 13.9 సెం.మీ, రెడ్ హిల్స్ లో 13.4 సెం.మీ, ఆసిఫ్ నగర్ విజయానగర్ కాలనీలో 13 సెం.మీ, ఘణాంక భవన్ దగ్గర 12.8 సెం.మీ, తిరుమలగిరి 12.4, కాంచన్ బాగ్, ముషీరాబాద్, శ్రీనగర్ కాలనీ 11.9, నాంపల్లి 11.5, ఆసిఫ్ నగర్ అమీర్ పేట, రాజేంద్రనగర్, మల్కాజ్ గిరి 11 సెం.మీ, కర్వాన్, బొల్లారం, పికెట్, రాంనగర్, అల్వాల్ లో 10 సెం.మీ, నాంపల్లి, బేగంబజార్, దీనదయాల్ నగర్, మెట్టుగూడలో 9 సెం.మీ, సికింద్రాబాద్ , యూసుఫ్ గూడ, కావాడిగూడ 8 సెం.మీల వర్షం పడింది.

భారీ వర్షాలకు రోడ్లన్నీ నీటితో నిండి పోయాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని మోండామార్కెట్, కాకాగూడ, మల్కాజిగిరి, ఆనంద్ బాగ్, ఎన్ఎండీసీ కాలనీ, రాజ్ నగర్ , సత్య రాఘవేంద్ర కాలనీలు, బోయిన్పల్లి సీతారాం పురి కాలనీలో నాలాలు పొంగి ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై చేరిన నీటిని తొలగించేందకు జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది.

మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతోంది వాతావరణ శాఖ. దక్షిణ మహారాష్ట్ర, దాన్ని ఆనుకుని ఉన్న గోవా, కర్ణాటక, తూర్పు మధ్య అరేబియా సముద్ర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర, తూర్పు తెలంగాణాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు చాన్స్ ఉందంటున్నారు.