
- ఉమ్మడి జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు
- నీట మునిగిన పంటలు.. పలు కాలనీలు జలమయం..
- ఉప్పొంగిన వాగులు, కూలిన చెట్లతో రాకపోకలు బంద్..
- కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఖమ్మం/భద్రాద్రికొత్తగూడెం, నెట్వర్క్, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రిజర్వాయర్లు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. వాగులు అన్నింటికి వరద ప్రవాహం రావడంతో చిన్న పాటి కుంటల నుంచి పెద్ద ప్రాజెక్టుల వరకు పూర్తిగా నిండాయి. లంకా సాగర్ ప్రాజెక్టు, వైరా రిజర్వాయర్ అలుగు పారుతుండగా, పాలేరు రిజర్వాయర్ నీటిపట్టం 23 అడుగులకు గాను 21 అడుగులకు చేరింది. ఈ మూడు ప్రాజెక్టులకు ఇన్ ఫ్లో పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
ఖమ్మం జిల్లాలో 1,061 చెరువులకు గాను 290 చెరువులు అలుగుపోస్తున్నాయి. మరో 374 చెరువులు 90 నుంచి 100 శాతం వరకు నిండగా, ఇంకో 200 చెరువులు 70 శాతం నుంచి 90 శాతం వరకు నిండాయి. 105 చెరువులు 50 శాతం నుంచి 75 శాతం వరకు నిండాయి. 92 చెరువుల్లోకి మాత్రమే 50 శాతం లోపు నీరు చేరిందని ఇరిగేషన్ అధికారులు ప్రకటించారు. మరోవైపు ఈ వర్షం, వరదల కారణంగా పలు మండలాల్లో పత్తి చేలలోకి వరద నీరు చేరింది. ఈ కారణంగా జరిగిన పంట నష్టంపై అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారు.
వర్షపాతం నమోదు ఇలా..
బుధ, గురువారాల్లో ఖమ్మం జిల్లాలో భారీ వర్షం కురిసింది. 24 గంటల్లో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 188.76 సెంటీ మీటర్ల వర్షం పడింది. అత్యధికంగా సత్తుపల్లిలో 17.5 సెంటీ మీటర్లు, ఖమ్మం రూరల్ లో 12.6, చింతకానిలో 12.4, కొణిజెర్లలో 12, తల్లాడలో 11.8, వైరాలో 11.4, వేంసూరులో 11.1, పెనుబల్లిలో 10.5, ఎర్రుపాలెంలో 9.6, కామేపల్లిలో 9.5, కారేపల్లిలో 7.8, మధిరలో 7.6, ఖమ్మం అర్బన్ లో 7.4, రఘునాథపాలెంలో 7.3, ఏన్కూరులో 7.2, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, కల్లూరులో 5.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఈ వర్షాల కారణంగా గురువారం ఖమ్మం జిల్లాలో స్కూళ్లకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సెలవు ప్రకటించారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు
భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో ఖమ్మం కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. అత్యవసర సమయాల్లో ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్లు 1077, 9063211298 ను ఏర్పాటు చేశారు. చింతకాని మండలం రామకృష్ణాపురం చెరువు అలుగు పారి, ఉధృతితో ప్రవహిస్తుండడంతో ఖమ్మం, బోనకల్ ప్రధాన రహదారిలో ప్రధాన రహదారిపై వరద ప్రవహిస్తోంది. ధంసలాపురం వద్ద వరద ప్రవాహాన్ని కలెక్టర్ అనుదీప్ పరిశీలించి పలు సూచనలు చేశారు. సత్తుపల్లిలో ముంపు ప్రాంతాలను ఎమ్మెల్యే మట్టా రాగమయి దంపతులు పరిశీలించారు.
నిలిచిన రాకపోకలు
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని గుండాల, చంద్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, పాల్వంచ, ఆళ్లపల్లి మండలాల్లోని వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గుండాల మండలంలోని ఏడు మెలికల వాగు ఉధృతితో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చంద్రుగొండ మండలంలో పోకల గూడెం–బాల్య తండా గ్రామాల మధ్య గల వాగు రోడ్డుపై నుంచి ఉప్పొంగి ప్రవహస్తుండడంతో అధికారులు రాకపోకలను ఆపేశారు.
అన్నపురెడ్డిపల్లి మండలంలోని వెదుళ్ల వాగు ఉధృతితో అబ్బుగూడెం, కట్టుగూడెం గ్రామాల మధ్య రాకపోకలను నిలిపి వేశారు. ఆయా మండలాల్లోని లోతట్టు ప్రాంతాల్లో పలు చోట్ల వరి, పత్తి పంటలు వరద నీటిలో మునిగాయి. పాల్వంచ మండ లంలోని కిన్నెరసాని ప్రాజెక్టు నుంచి అధికారులు 5వేల క్యూ సెక్కుల వద్ద నీటిని గురువారం ఎనిమిదవ గేటును ఐదు అడుగుల ఎత్తు లేపి 5వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.