ఒక్క వానకే కరీంనగర్ కాలనీలు మునక

ఒక్క వానకే కరీంనగర్ కాలనీలు మునక
  • చిగురుమామాడిలో అత్యధికంగా 11.3 సెం.మీ వర్షపాతం 
  • సిటీలోని జ్యోతినగర్ కాలనీలో ఇండ్లలోకి వరద నీరు
  • నీటమునిగిన స్టేడియం 

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వానలు పడ్డాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు కురిసిన కొద్దిపాటి వర్షాలకే కరీంనగర్ సిటీలో పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. వరద నీరు పొంగి రోడ్లన్నీ జలమయమయ్యాయి. జిల్లాలో అత్యధికంగా చిగురుమామిడి మండలంలో 11.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. సైదాపూర్ లో 10.1, కొత్తపల్లిలో 8.95, హుజురాబాద్ లో 8.28, శంకరపట్నంలో 6.8, జమ్మికుంటలో 6.7, తిమ్మాపూర్ లో 6, మానకొండూరు మండలంలో 5.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. సిటీలోని అంబేడ్కర్ స్టేడియం పూర్తిగా మునిగింది. మంగళవారం ఉదయమే స్టేడియంలో యోగా కార్యక్రమం నిర్వహించడంతో అక్కడికి వచ్చిన ఓ ఆఫీసర్​వాహనం స్టేడియం లోపల బురదలో ఇరుక్కుపోయింది. 

ఇండ్లల్లకు మురుగునీరు 

వర్షానికి  కరీంనగర్ సిటీలోని జ్యోతినగర్ లో  మురుగునీరు ఇండ్లలోకి వచ్చింది. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో పలు కాలనీల్లో నీరు చేరి జనం ఇబ్బంది పడ్డారు. దీంతో రోడ్డు మార్గంలో వెళ్లే స్కూల్ పిల్లలు భయభయంగా నీళ్లలోంచి వెళ్లారు. హునుమాన్ ఆలయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. ఈ ఏరియాలో స్ట్రామ్ వాటర్ డ్రైయిన్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇవి పూర్తికాకపోవడంతోనే ఇండ్లలోకి నీళ్లు వచ్చాయి. వానాకాలం సమీపిస్తున్నా.. పనులు లేట్ గా చేయడంతోనే  ఇబ్బందులు వస్తున్నాయని కాలనీవాసులు వాపోయారు.