దేవ్ పల్లిలోని షాపులోకి దూసుకెళ్లిన కారు.. తండ్రీకొడుకు మృతి

దేవ్ పల్లిలోని షాపులోకి దూసుకెళ్లిన కారు.. తండ్రీకొడుకు మృతి
  •     మరో కొడుకుకు గాయాలు
  •     మృతులు మధ్యప్రదేశ్​వాసులు
  •     మైలార్ దేవ్​పల్లిలో ఘటన

శంషాబాద్, వెలుగు: స్వెటర్లు, బ్లాంకెట్ల షాపులోకి కారు దూసుకెళ్లిన ఘటనలో తండ్రీకొడుకు మృతిచెందగా.. మరో కొడుకు  గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్​కు చెందిన ప్రభు మహరాజ్(60), ఆయన కొడుకులు దీపక్ (20), సత్యనాథ్ కొన్నేళ్లుగా మైలార్ దేవ్​పల్లిలోని దుర్గా నగర్ చౌరస్తా వద్ద రోడ్డు పక్కన షెడ్డు ఏర్పాటు చేసుకొని బ్లాంకెట్లు, స్వెటర్లు అమ్ముతున్నారు. బుధవారం ఉదయం గగన్‌ పహాడ్ నుంచి చాంద్రాయణగుట్ట వైపు వెళ్తున్న కారు ఓవర్​స్పీడ్​తో​అదుపుతప్పి వీరి షాపులోకి దూసుకెళ్లింది. 

ఈ ప్రమాదంలో ప్రభు మహరాజ్, ఆయన చిన్న కొడుకు దీపక్ అక్కడికక్కడే మృతిచెందగా, పెద్ద కొడుకు సత్యనాథ్​స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే కారును అక్కడే వదిలేసి అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. డ్రైవర్​హుస్సేన్​తోపాటు మరో ముగ్గురిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది. వీరంతా కాలేజీ స్టూడెంట్స్​అని సమాచారం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ పేర్కొన్నారు.