- మహిళా వర్సిటీ విద్యార్థినులకు నేరెళ్ల శారద భరోసా
- ఇకపై ఏ సమస్య ఎదురైనా మహిళా కమిషన్‌కు చెప్పండి
- విద్యార్థుల ఆరోపణలపై వర్సిటీలో పర్యటన
బషీర్‌బాగ్, వెలుగు: మహిళా వర్సిటీ విద్యార్థినులకు అండగా ఉంటామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద భరోసా ఇచ్చారు. బుధవారం కోఠిలోని వర్సిటీని ఆమె సందర్శించి, విద్యార్థినుల సమస్యలు తెలుసుకున్నారు. తొలుత వర్సిటీ ప్రిన్సిపాల్ లోకపావనితో భేటీ అయ్యారు. విద్యార్థినుల ఆరోపణలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఆరా తీశారు. వర్సిటీలో ఉన్న సీసీటీవీ కెమెరాల పని తీరును పరిశీలించి, అక్కడ పని చేస్తున్న మగ సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న మెస్ ఇన్చార్జి వినోద్ ను సస్పెండ్ చేశామని ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వివరించారు.
ఒకొక్కసారి డోర్లు తెరిచి లోపలికి వస్తున్నరు
అనంతరం యూజీ హాస్టల్ మెస్‌ను చైర్పర్సన్ పరిశీలించి, ఫుడ్ మెనూ వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత విద్యార్థినులతో మాట్లాడి, వారి సమస్యలు విన్నారు. హాస్టల్ ఓయూలో ఉండడం వల్ల ప్రయాణంలో ఆకతాయిల వేధింపులకు గురవుతున్నామని విద్యార్థినులు తెలిపారు. కోఠి క్యాంపస్‌లోనే హాస్టల్ నిర్మాణం కోరుకుంటున్నామన్నారు. సినిమా షూటింగ్సమయాల్లో ప్రైవేట్ సెక్యూరిటీ తమతో దురుసుగా ప్రవర్తిస్తున్నారన్నారు. షూటింగ్ జరిగే ప్రాంతం పూర్తిగా మూసి వేయడం వల్ల చుట్టూ తిరిగి హాస్టల్‌కు వెళ్లాల్సి వస్తుందన్నారు.
ఇక్కడ ఎలక్ట్రీషియన్లుగా పని చేసే వాళ్లను యూపీ నుంచి తీసుకొచ్చారని, ఒకొక్కసారి తమ అనుమతి లేకుండానే హాస్టల్ డోర్లు తెరిచి లోపలికి వస్తున్నారని వాపోయారు. తమకు సరైన భద్రత లేకపోవడంతో తమ తల్లిదండ్రులూ ఆందోళనకు గురవుతున్నారని తమ గోడును వెళ్లబోసుకున్నారు. దీంతో అధైర్యపడొద్దని అండగా ఉంటాని కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదకు భరోసా ఇచ్చారు. ఇకపై ఏ సమస్య ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం ఓయూ పీజీ గర్ల్స్ హాస్టల్‌ను పరిశీలించారు.
