రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు

రాష్ట్రంలో పలుచోట్ల  మోస్తరు నుంచి భారీ వర్షాలు

రాష్ట్రంలో ఆకాశం మబ్బు పట్టింది. రెండ్రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాల్లోనూ వానలు పడుతున్నాయి. నిజామాబాద్, మహబూబాబాద్, కుమ్రం భీం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గోదావరి ప్రాజెక్టులకు మళ్లీ వరద ఉధృతి పెరుగుతోంది. మరో రెండ్రోజులు రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణశాఖ. కొద్దిగంటల్లోనే కుంభవృష్టి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర తెలంగాణలోని 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది IMD. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో అత్యంత భారీ వర్షాలు పడొచ్చని హెచ్చరించింది వాతావరణశాఖ. 

నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, భదాద్రికొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే చాన్స్ ఉందని తెలిపింది వాతావరణశాఖ. నల్లగొండ, సూర్యాపేట, జనగామ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడొచ్చని ఎల్లో అలర్ట్ ప్రకటించింది IMD. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తీవ్ర అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది వాతావరణశాఖ. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వరంగల్, హనుమకొండ జిల్లాలో భారీ వర్షం కురిసింది. కరీంనగర్ ఓ మోస్తరు వాన పడింది. వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ లో భారీ వర్షానికి రోడ్లన్ని జలమయం అయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియాలో ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచింది.