
- మెతుకుసీమాలో దంచికొట్టని వానలు..
- మెదక్‌లో 78, సిద్దిపేటలో 75, సంగారెడ్డిలో 70 శాతం అధికం
మెదక్/ సిద్దిపేట/సంగారెడ్డి, వెలుగు : వరుసగా కురిసిన వానలకు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కువ సంఖ్యలో చెరువులు అలుగు పారుతున్నాయి. ప్రాజెక్టులు, చెక్‌డ్యామ్ లు పొంగిపొర్లుతున్నాయి. జూన్ 1 నుంచి జూలై 21 వరకు కురవాల్సిన వర్షం కంటే మెదక్ జిల్లాలో 78 శాతం, సిద్దిపేట జిల్లాలో 75 శాతం, సంగారెడ్డి జిల్లాలో 70 శాతం అధిక వర్షం కురవంతో రైతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. మెదక్ జిల్లాలో 21 మండలాలు ఉండగా 14 మండలాల్లో, సిద్దిపేట జిల్లాలో 26 మండలాలు ఉండగా 16 మండలాల్లో, సంగారెడ్డి జిల్లాలో 28 మండలాలు ఉండగా 18 మండలాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.
నిండుకుండలా..
ఉమ్మడి జిల్లా వరప్రదాయని సింగూరు ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం కర్నాటక నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరింది. 29.917 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల సింగూరులో శనివారం సాయంత్రం వరకు 20.794 టీఎంసీల నీటినిల్వ ఉంది. కాగా బయట నుంచి యావరేజ్ గా 6403 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, అవుట్ ఫ్లో 385 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. మంజీరా, నల్లవాగు, నారింజ ప్రాజెక్టులు నిండుకున్నాయి. మెదక్ జిల్లాలోని వనదుర్గా ప్రాజెక్ట్ పూర్తిగా నిండి మూడు రోజులుగా ఆనకట్ట మీద నుంచి నీరు పొంగిపొర్లుతోంది. మూడు జిల్లాల్లో మంజీరా నది, ఆయా వాగుల మీద నిర్మించిన చెక్ డ్యామ్లది అదే తీరు ఉంది. జిల్లాలో మెజారిటీ చెరువులు అలుగులు పారుతున్నాయి. దీంతో భూగర్భ జలాలు పెంపొందనున్నాయి. ఈ సీజన్ లో పంటలు సాగుకు ఢోకా లేదని రైతులు మురిసిపోతున్నారు.
ఎన్ని చెరువులు.. ఎంత నిండాయి..
మెదక్ జిల్లాలో మొత్తం 1,881 చెరువులు ఉండగా 822 చెరువులు అలుగు పారుతున్నాయి. 850 చెరువుల్లో 75 నుంచి 100 శాతం నీరు చేరింది. 199 చెరువుల్లో 50 నుంచి 75 శాతం నీరు చేరింది. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 2,011 చెరువులు ఉండగా, దాదాపు 1,856 చెరువులు నిండాయి. సిద్దిపేట జిల్లాలో 3,426 చెరువులు ఉండగా దాదాపు 150కి పైగా చెరువులు అలుగులు పారుతున్నాయి. మిగిలిన వాటిలో 300 చెరువులు 75 శాతం, 500 పై గా చెరువు 50 శాతానికి పైగా నిండాయి. దాదాపు రెండు వేల చెరువులు జలకళను సంతరించుకోగా సిద్దిపేట నియోజకవర్గంలోనే 70 , దుబ్బాక నియోజకవర్గంలో 50 చెరువులు వంద శాతం నిండాయి.