ముంచిన వాన..పొంగిపొర్లుతున్నవాగులు,వంకలు

ముంచిన వాన..పొంగిపొర్లుతున్నవాగులు,వంకలు
  • మంచిర్యాల జిల్లాలో 17 సెం.మీ వర్షపాతం
  • ఆగకుండా రెండు గంటలు కుండపోత
  • చాలా కాలనీలు జలమయం
  • గుంతలు పడిన రోడ్లతో జనం అవస్థలు
  • కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్
  • శంషాబాద్ ఎయిర్ పోర్టు రోడ్డు జామ్
  • మంచిర్యాల జిల్లాలో 17 సెం.మీ వర్షపాతం

హైదరాబాద్‌‌, వెలుగురాష్ట్రవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని చోట్ల ఇండ్లు కూలిపోయాయి, చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. చెరువులు తెగడంతో పంటలు నీట మునిగాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు పెద్దపల్లి, రంగారెడ్డి, మంచిర్యాల, హైదరాబాద్‌‌, మేడ్చల్‌‌-మల్కాజిగిరి, రాజన్నసిరిసిల్ల, నిజామాబాద్‌‌, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. మంచిర్యాల జిల్లాలోని కన్నెపల్లిలో 17 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. పెద్దపల్లి జిల్లాలోని రంగంపల్లిలో 15, ఇదే జిలలా సుగ్లాంపల్లి, రంగారెడ్డి జిల్లా యాచారంలో 14 సెంటీమీటర్ల చొప్పున వాన పడింది. మొత్తంగా ఈ సీజన్​లో అన్ని జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదుకాగా.. కుమ్రం భీం ఆసిఫాబాద్‌‌, నిజామాబాద్‌‌, వరంగల్‌‌ అర్బన్‌‌, రాజన్న సిరిసిల్ల, ములుగు, నారాయణపేట జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువగా వానలు పడ్డాయి.

హైదరాబాద్.. ఊరంతా చెరువే..

హైదరాబాద్​ సిటీలో బుధవారం సాయంత్రం వాన దంచికొట్టింది. సాయంత్రం ఐదు గంటలకే చీకట్లు కమ్ముకుని.. ఆగకుండా రెండు గంటలకుపైగా వాన కురవడంతో చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లన్నీ నీళ్లతో నిండి, చెరువుల్లా మారిపోయాయి. నడుములోతు నీళ్లు ప్రవహించాయి. నాలాల పక్కన ఉన్న కాలనీలు, లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలిచింది. కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్​ జామ్​ అయింది. ఆఫీసుల నుంచి ఇండ్లకు వెళ్లే సమయం కావడంతో చాలా మంది ఇబ్బందిపడ్డారు.

అల్లాపూర్​ డివిజన్​ సఫ్దర్​నగర్​ కాలనీ పూర్తిగా జలదిగ్బంధమైంది. భోలక్​పూర్, రాంనగర్, కవాడిగూడ, అడిక్​మెట్, గాంధీనగర్ డివిజన్ పరిధిలోని నాగమయ్య కుంట, పద్మా కాలనీలు జలమయం అయ్యాయి. మీర్ పేట పరిధిలోని జిల్లెలగూడ మిథిలానగర్ కాలనీలో ఇండ్లలోకి నీళ్లు చేరాయి. కొన్ని చోట్ల చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. పలు కాలనీల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. సగటున సిటీ అంతటా 4 సెంటీ మీటర్ల మేర వర్షపాతం నమోదైంది.

శంషాబాద్​ ఎయిర్ పోర్టుకు వెళ్లే మార్గాలన్నీ నీళ్లతో నిండిపోయాయి. శంషాబాద్ బస్టాండు, బెంగళూరు జాతీయ రహదారిలోని మెయిన్ బస్టాండ్, ఎయిర్ పోర్టు వద్ద వరద చేరింది. ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఓవైపు వాన, మరోవైపు భారీ ట్రాఫిక్ తో ఎయిర్​పోర్టుకు వెళ్లేవారు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ఇక బషీర్ బాగ్, అబిడ్స్, నాంపల్లి, లక్డీకాఫుల్, కోఠి, బేగంబజార్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు చేరి, ట్రాఫిక్​ నిలిచిపోయాయి. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే రోడ్లపై సుమారు 114 చోట్ల నీళ్లు నిలిచిపోయాయి. మ్యాన్​హోల్స్​ తెరిచిపెట్టినా, మోటార్లతో ఎత్తిపోసినా కూడా చాలా చోట్ల ఇబ్బందులు తప్పలేదు. ఐటీ కారిడార్ లోని సైబర్​టవర్స్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, కొత్తగూడ, మాదాపూర్​ ప్రాంతాల్లో కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్​ జామ్​ అయింది.

పంటలు మునిగి.. ఇండ్లు కూలి..

  • రాజన్న సిరిసిల్ల జిల్లా నీలోజిపల్లిలో పిడుగు పడి కుసుంబ లక్ష్మణ్​ అనే వ్యక్తి మృతి చెందారు. నాంపల్లిలో కొన్ని ఇండ్లు కూలిపోయాయి. కోనరావుపేట మండలంలో పిడుగుపడి తిరుపతిరెడ్డికి చెందిన ఎద్దు చనిపోయింది.
  • జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపెల్లిలో ఒక పెంకుటిల్లు కూలిపోయింది.
  • పెద్దపల్లి జిల్లాలో హుస్నేన్​మియా వాగు, మానేరు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి. కొన్ని ఊర్లలో పొలాలు నీట మునిగాయి.
  • నల్లగొండ జిల్లాలో భారీ వర్షాలతో దాదాపు 1,500 హెక్లార్లలో వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. పది ఇండ్లు కూలిపోయాయి. చండూరు మండలంలో చెరువుకు గండిపడింది.
  •  ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లా పరిధిలో విస్తారంగా వానలు పడుతున్నాయి. చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్​ రిజర్వాయర్​ నిండటంతో గేట్లు ఎత్తి నీళ్లు వదులుతున్నారు. మాగనూరు మండలంలో ఎనిమిది వందల ఎకరాల్లో వరికి నష్టంకు వాటిల్లింది.
  •  నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం బాపన్ పల్లిలో రోడ్లు కోతకు గురయ్యాయి. జిల్లా కేంద్రంలోని బురుడువాడిలో ఒక ఇల్లు కూలిపోయింది.
  •  సంగారెడ్డి జిల్లాలోని నాందేడ్-అకోలా నేషనల్ హైవే 161 తీవ్రంగా దెబ్బతిన్నది. వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతోంది.
  •  నిజామాబాద్ జిల్లాలో సుమారు 110 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. సిరికొండ మండలం జినిగ్యాలలోని మైసమ్మ చెరువుకు మూడు చోట్ల గండ్లు పడ్డాయి. ఎడపల్లి మండలంలో వంద ఎకరాలకుపైగా నష్టం వాటిల్లింది. మల్కాపూర్ శివారులో రోడ్డు కోతకు గురైంది
  • కామారెడ్డి జిల్లాలో వానల ధాటికి రోడ్లు దెబ్బతిన్నాయి. ఎల్లారెడ్డి – నిజాంసాగర్ మార్గంలో కిలోమీటరు పొడవున రోడ్డు కోతకు గురైంది. బిచ్కుంద మండలం దేవరలో కల్వర్టు కొట్టుకుపోయింది.
  • ఆసిఫాబాద్ జిల్లాలో రెండు వందల ఎకరాల్లో వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. పెన్ గంగ, ప్రాణహిత, ఎర్రవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుమ్రం భీం, వట్టివాగు ప్రాజెక్టులు ఎత్తి నీళ్లు వదిలేస్తున్నారు.

మూడు రోజులు వానలే

రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని హైదరాబాద్‌‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కర్ణాటక, దానిని ఆనుకుని ఉన్న రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఉందని.. దానివల్ల ఏపీ, తెలంగాణల్లో వానలు పడుతున్నాయని సూచించింది.