వరద బాధితులకు అండగా ఉంటాం: ఉత్తరాఖండ్ సీఎం ధామి

వరద బాధితులకు అండగా ఉంటాం: ఉత్తరాఖండ్ సీఎం ధామి
  • ఉత్తరాఖండ్ మృతుల కుటుంబాలకు  రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా

ఉత్తరాఖండ్ వరద బాధితులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. భారీ వర్షాలు, వరదల వల్ల ప్రాణాలు  కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం అందిస్తామని సీఎం పుష్కర్ ధామి ప్రకటించారు. ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో 40 మంది చనిపోయారు. ఒక్క నైనిటాల్ లోనే 25 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదలతో పాటు పలు చోట్ల కొండ చరియలు విరిగిపడడంతో ఇళ్లు నేల మట్టమయ్యాయి. పలు ప్రాంతాల్లో రోడ్డు, రైలు మార్గాలు ధ్వంసమయ్యాయి. వంతెనలు కూలి పోయాయి. కుమావ్ ప్రాంతంపై వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పుష్కర్ సింగ్ దామి ఏరియల్ సర్వే నిర్వహించారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఇళ్లు కోల్పోయిన వారికి లక్షా 90 వేల చొప్పున సాయం అందిస్తామన్నారు. వెంటనే పంట నష్టం అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం సహాయక చర్యల కోసం మూడు హెలికాప్టర్లు రంగంలోకి దించారు. SDRF, NDRF, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. 

భారీ వర్షాలకు నైనిటాల్ ఆగమైంది. ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. నైనా దేవి టెంపుల్, మాల్ రోడ్డును వరదలు ముంచెత్తాయి. కోసి నది ఉప్పొంగి ప్రవహించడంతో రామ్ నగర్-రాణి కేత్ మార్గంలో లెమన్ ట్రీ రిసార్టులో వంద మంది చిక్కుకుపోగా.. వారిని  సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. చార్ ధామ్ యాత్రకు వచ్చిన వంద మంది గుజరాత్ యాత్రికులు ఉత్తరాఖండ్ లో చిక్కుకుపోయారు. రాష్ట్రంలో పరిస్థితులపై సీఎం పుష్కర్ సింగ్ దామికి ఫోన్ చేసి ఆరా తీశారు ప్రధాని, కేంద్రం నుంచి అవసరమైన సాయం అందిస్తామన్నారు.