సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. పాత ఇళ్లు కూలిపోయాయి. దుబ్బాక మండల పరిధిలోని రఘతంపల్లి గ్రామంలో వడ్ల శంకరయ్య ఇల్లు పైకప్పు కూలింది.. కూలిన ప్రాంతాన్ని స్థానిక సర్పంచ్, ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించారు. ఆదుకొని న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఏకధాటిగా కురుస్తున్న వానలకు ప్రజలు బయటకు రావడం లేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా చెరువులు కుంటల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈదురు గాలులతో కూడిన వర్షానికి పెద్ద పెద్ద చెట్లు నేలకూలుతున్నాయి. దుబ్బాక పరిధిలోని కుడవెల్లి ఉగ్రరూపం దాల్చుతోంది. దుబ్బాకలో నూతనంగా నిర్మిస్తున్న బస్టాండ్ వద్ద చెట్టు నేలకొరిగింది. ఈ ప్రమాదంలో షెడ్డుపై ధ్వంసమైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అక్కడ ప్రయాణికులు ఎవరు లేకపోవడం తో పెను ప్రమాదం తప్పింది. రోడ్డుపై చెట్టు పడిపోవడంతో బస్సులు బస్టాండులోకి రావడం లేదు. ఆర్టీసీ అధికారులు చెట్టును తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
రాష్ట్రంలో గత 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ అత్యంత భారీ వర్షాలు నమోదు అయ్యాయి. కుమ్రంభీం జిల్లాలోని కెరమెరిలో 30.5 సెంటీ మీటర్ల అత్యంత భారీ వర్షం రికార్డయ్యింది. ఆదిలాబాద్ జిల్లాలోని పిప్పల్దారిలో 30 సెంటీమీటర్లు, ఆదిలాబాద్ లోని శ్రీకొండలో 29, కరీంనగర్ జిల్లా ఆమకొండలో 28.5, నిర్మల్ జిల్లా వాద్యల్ 27, నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందాలో 26, కొమరం భీం జిల్లా జైనురు, సిరిపూర్ లో 25 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయ్యింది.
