సంగారెడ్డి జిల్లాలో భారీ వడగండ్ల వర్షం

సంగారెడ్డి జిల్లాలో భారీ వడగండ్ల వర్షం

సంగారెడ్డి జిల్లాలో మార్చి 16న భారీ వడగండ్ల వర్షం కురిసింది. ముఖ్యంగా జిల్లాలోని కోహిర్ మండలం బడంపెట్ గ్రామంలో ఈదురుగాలుల‌తో కూడిన వ‌డ‌గండ్ల వాన పడింది. భారీ వర్షం కురవడంతో పాటు ప‌లుచోట్ల పిడుగులు ప‌డ్డాయి. దీంతో జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు తీవ్ర అంత‌రాయం ఏర్పడింది. సంగారెడ్డి ప‌ట్ట‌ణంలోని రోడ్లన్నీ జ‌ల‌మ‌యం అయ్యాయి. లోత‌ట్టు ప్రాంతాల్లోకి వ‌ర్షపు నీరు చేర‌డంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వడగండ్ల వాన కురవడంతో ఇండ్ల పైకప్పులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. గ‌త వారం ప‌ది రోజుల నుంచి ఎండ‌లు మండిపోతున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ వ‌ర్షాలు కురవడంతో ప్రజ‌లు ఉక్కపోత నుంచి ఉప‌శ‌మ‌నం పొందారు.

రాష్ట్రంలో రాబోయే 48 గంటల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై, సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ వెల్లడించింది. జార్ఖండ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ మీదుగా తెలంగాణ వరకు ఉన్న ద్రోణి బుధవారం ఒడిశా వైపు కదిలిందని, తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో వానలు పడుతాయని వివరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వచ్చే మూడు రోజులు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం వాతావరణం ఒక్కసారిగా చల్లపడినట్టు తెలిపింది.

తెలంగాణ రాష్ట్రంలో ద్రోణి ప్రభావంతో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఇటీవలే వెల్లడించింది. మార్చి 15, 16, 17, 18 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయని వెల్లడించారు అధికారులు. ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. పగటి పూట ఎండ, సాయంత్రానికి వర్షాలు పడతాయని వివరించారు అధికారులు. ఈదురు గాలులతో  కూడిన వర్షాలు పడనున్నాయన్నారు. 16న ఉత్తర, పశ్చిమ, మధ్య దక్షిణ జిల్లాల్లో వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని.. 17 18 తేదీల్లో ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. కాగా  మూడు రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.