రెండు గంటలపాటు దంచికొట్టిన వాన

రెండు గంటలపాటు దంచికొట్టిన వాన

హైదరాబాద్/మాదాపూర్/ఎల్బీ నగర్/జీడిమెట్ల/మల్కాజిగిరి, వెలుగు:  హైదరాబాద్​ సిటీలో మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. రెండు గంటల పాటు దంచికొట్టిన వానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. స్కూళ్లు, కాలేజీల నుంచి స్టూడెంట్లు ఇంటికి వెళ్లే టైమ్ లో వాన పడడంతో వారు ట్రాఫిక్ జామ్ తో ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం ఆఫీసుల నుంచి వెళ్లే వారు, పని మీద బయటకు వచ్చిన వారు కూడా తిరిగి ఇండ్లకు చేరుకునేందుకు గంటల కొద్దీ టైమ్ పట్టింది.  రోడ్లు, కాలనీల్లో నీరు చేరడం, మెయిన్ రోడ్లపైనా నడుం లోతు నీరు నిలవడంతో గంటల తరబడి ట్రాఫిక్ జామయ్యింది. కుత్బుల్లాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మల్కాజిగిరి, ఎల్బీ నగర్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో వాహనాలు స్తంభించాయి. కొత్తగూడ జంక్షన్, శిల్పారామం, సిటీ వైన్స్, నెక్టార్​ గార్డెన్, ఎస్బీఐ కాలనీ, రాఘవేంద్ర కాలనీ, ప్రశాంత్​నగర్​కాలనీల్లో రోడ్డుపై వర్షపు నీరు చేరింది. సూరారంలోని మంత్రి మల్లారెడ్డి హాస్పిటల్ లో పెద్ద ఎత్తున వర్షం నీరు చేరింది. దీంతో పేషెంట్లు ఇబ్బంది పడ్డారు.

హాస్పిటల్ కు ఎగువ పై భాగంలో  ఉన్న  కట్టమైసమ్మ చెరువు తూములను మూసివేసి  నిర్మాణాలు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు ఆరోపించారు. అటు విజయవాడ జాతీయ రహదారిపై ఎల్బీ నగర్ లోని చింతలకుంట వద్ద రోడ్డుపై నడుంలోతు నీరు చేరడంతో వెహికల్స్ ఆగిపోయాయి. కొంతమంది వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సాయంతో వెహికల్స్​ను బయటకు తీసుకొచ్చారు. చింతల్​కుంట నుంచి ఎన్టీఆర్ నగర్ వరకు గంట పాటు ట్రాఫిక్ జామైంది. ఫ్లై ఓవర్లు, అండర్ పాస్​లతో పాటు ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ కనిపించింది. అంకుర హాస్పిటల్ చుట్టూ నీరు చేరడంతో  బయటకు వెళ్లేవారు ఇబ్బంది పడ్డారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్ నీటిని  తోడడంతో ఇబ్బందులు తప్పాయి. మల్కాజిగిరిలోనూ పలు ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. మౌలాలిలోని పూర్తిగా ఓ హోటల్ లోకి నీరు రావడంతో  హోటల్ ను మూసివేశారు. అలాగే  మధురానగర్, ఆనంద్​బాగ్, మల్లికార్జున్​నగర్, నేరేడ్​మెట్ పరిధిలోని పలు చోట్ల నీరు నిలిచింది.  మరో రెండు రోజుల పాటు సిటీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.