
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి భారీ వర్షసూచన ఉన్నదని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని పేర్కొన్నది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో శని, ఆదివారాల్లో (సెప్టెంబర్ 13, 14) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే చాన్స్ ఉన్నదని తెలిపింది. శనివారం నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఇక ఆదివారం నుంచి ఈ నెల 16 వరకు ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్న ఐఎండీ.. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఉరుములు, మెరుపులతోపాటు 30-, 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, శనివారం కూడా ఈ ప్రభావం కొనసాగవచ్చని తెలిపింది. ప్రజలు అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించింది.
కాగా, శుక్రవారం కరీంనగర్, మెదక్, జనగాం, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సిద్దిపేట, హన్మకొండ, యాదాద్రి, కామారెడ్డి, నాగర్ కర్నూల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసినట్లు ఐఎండీ తెలిపింది. ఈ నెల 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది.
కాగా, భారీ వర్షాల సమాచారంతో ప్రభుత్వం జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్‌ఎఫ్, పోలీసు విభాగాలను అప్రమత్తం చేసింది. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ టీమ్స్‌ను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే ఎస్డీఆర్ఎఫ్ నిధులతో సహాయక చర్యలు చేపట్టాలని సూచించింది.