పత్తి రైతు చిత్తు.. అధిక వర్షాలతో తగ్గిన దిగుబడి

పత్తి రైతు చిత్తు.. అధిక వర్షాలతో తగ్గిన దిగుబడి
  • కుళ్లిపోతున్న పత్తికాయలు
  • నాణ్యత లేక గిట్టుబాటు కాని రేటు 

భద్రాద్రికొత్తగూడెం/సుజాతనగర్, వెలుగు: అధిక వర్షాలు, మారుతున్న వాతావరణ పరిస్థితులు పత్తి పంటపై తీవ్ర ప్రభావం చూపాయి. పంట చేతికొచ్చే టైంలో పత్తికాయలు కుళ్లిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో దాదాపు1.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. జూలూరుపాడు, లక్ష్మీదేవిపల్లి, బుర్గంపహడ్​, సుజాతనగర్​, ఇల్లెందు, టేకులపల్లి, గుండాల మండలాల్లో ఎక్కువగా పత్తి వేశారు. 

ఈ మండలాల్లో ఎడతెగకుండా వానలు పడ్డాయి. జూన్ నుంచి అక్టోబర్ 24 వరకు సగటు వర్షపాతం 1060.3 మిల్లీమీటర్లు కాగా.. 1362.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సగటు కంటే ఇది 302.6 మిల్లీమీటర్లు ఎక్కువ. అధిక వర్షాలతో కాయ కుళ్లిపోయి దిగుబడి సగానికి సగం పడిపోతుంది. పెట్టుబడి పెరగడం, దిగుబడి తగ్గడంతో అప్పుల పాలయ్యే పరిస్థితి వచ్చిందని రైతులు వాపోతున్నారు. 

పత్తి ఏరే సమయంలో మంచి ఎండ ఉండాలి. ఇప్పటికీ వానలు పడుతుండడం, మబ్బులు పట్టడంతో పత్తికాయలు పగలడం లేదు. కొన్ని చోట్ల పత్తికాయలు చెట్ల మీదనే కుళ్ళిపోయి రాలిపోతున్నాయి. పూత, పిందె దశలో చేలలో నీళ్లు నిలిచిపోయి పత్తి మొక్కలు వాడిపోయి ఎర్రబారుతున్నాయి. పత్తి కాయల్లో తేమశాతం పెరగడంతో నల్లబారి మొలకలు వస్తున్నాయి. దీంతో దిగుబడి తగ్గడమే కాకుండా పత్తి నాణ్యత కూడా దెబ్బతింటోంది. 

ఎకరానికి 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి రావాల్సిఉండగా 5 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. పత్తి సాగు కోసం రైతులు ఎకరానికి రూ. 50వేల వరకు పెట్టుబడి పెడ్తున్నారు. దిగుబడి తగ్గడంతో పెట్టుబడి కూడా వస్తుందన్న గ్యారంటీ లేదని, పత్తి ఏరేందుకు కూలీ డబ్బుల కోసం కూడా అప్పులు చేయాల్సి వస్తొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి చేలలో వరదనీరు, బురద నిలిచిపోవడం వల్ల పత్తి తీసేందుకు కూలీలు రావడం లేదు. పత్తి నాణ్యత లేకపోవడంవల్ల మార్కెట్లో వ్యాపారులు తక్కువ రేటుకే కొంటున్నారు. 

వానలే ముంచాయి

నాకున్న నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేశాను. ఈసారి మంచి ధర పలుకుతుందని ఆశపడ్డా. వానల వల్ల పత్తి కాయలు పూర్తిగా పగలడం లేదు. అరకొరగా పగిలినా పత్తి తీస్తే కూలి డబ్బులు కూడా గిట్టుబాటు అయ్యేలా కనబడడం లేదు. వానల వల్ల కాయలు కుళ్లి పోయి పత్తి రంగు మారుతుంది.– ఉడుముల శ్రీనివాస్ రెడ్డి, రైతు, వేపలగడ్డ 

కాయలు నల్లబడ్తున్నయ్ 

ఐదెకరాల్లో పత్తి సాగు చేస్తున్నా. ఎకరానికి దాదాపు రూ. 50వేల పెట్టుబడి పెట్టా. అధిక వర్షాలతో పత్తి కాయలు నల్లబడ్తున్నయ్​. వాతావరణ మార్పులతో పంట దెబ్బ తిని పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఆదుకోవాలి. – సత్తి నాగేశ్వరరావు, రైతు, రేపల్లెవాడ