- సాధారణం కంటే ఎక్కువే పడుతయ్
- 106% పైగా వర్షపాతం నమోదయ్యే చాన్స్
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
హైదరాబాద్/ శంషాబాద్/ పరిగి, వెలుగు: ఈసారి వర్షాకాలంలో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య వర్షపాతం సాధారణం కంటే అధికంగా(106 శాతానికి పైనే) నమోదయ్యే చాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. జూన్ నెలలో మస్తు వానలు ఉంటాయని, ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మే 29న కేరళలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మంగళవారం కేరళ అంతటా, కర్నాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని చెప్పింది. రెండు, మూడు రోజుల్లో కర్నాటకలోని మరి కొన్ని ప్రాంతాలు, కొంకణ్, గోవా, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే చాన్స్ ఉంది. మంగళవారం రాష్ట్రంలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. రంగారెడ్డి జిల్లా పెద్దషాపూర్‌లో 4.8 సెం.మీ., జనగాంలోని కోల్కొండలో 4.5, సూర్యాపేటలోని నూతన్‌కల్‌లో 4.3, సంగారెడ్డిలోని కొండాపూర్‌లో 4.1, నాగర్‌కర్నూల్‌లోని సిరసనగండ్లలో 4 సెం.మీ. చొప్పున వర్షపాతం రికార్డయ్యింది. ఇక దేశవ్యాప్తంగా కూడా ఈ ఏడాది సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఇండియా మెటిరియోలజికల్ డిపార్ట్ మెంట్ (ఐఎండీ)
వెల్లడించింది.
రోడ్డుపై విరిగిన చెట్టు..
గ్రేటర్హైదరాబాద్ పరిధిలోని మీర్‌పేట, బడంగ్‌పేట్, బాలాపూర్, గుర్రంగూడ, ఎల్బీనగర్, రాంనగర్, ఉప్పల్, నాచారం ప్రాంతాల్లో వర్షం పడింది. అబ్దుల్లాపూర్‌మెట్‌లోని కాటమయ్య ఆలయంపై పిడుగు పడి గోపురం స్వల్పంగా ధ్వంసమైంది. వికారాబాద్‌జిల్లా పరిధిలోనూ చాలా చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. పూడూరు మండల పరిధిలో వర్షానికి హైవే143 పై చెట్టు విరిగి పడింది. దీంతో సుమారు10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్అయింది. పరిగి – వికారాబాద్ – తాండూర్ వైపు వెళ్లే వాహనాలు, హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
విమానాల దారి మళ్లింపు
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో మంగళవారం ఈదురు గాలుల వర్షం పడింది. దీంతో శంషాబాద్ విమానాశ్రయంలో దిగాల్సిన పలు విమానాలను అధికారులు దారి మళ్లించారు. ప్రతికూల వాతావరణం వల్ల రాజమండ్రి – హైదరాబాద్, ఢిల్లీ-– హైదరాబాద్ విమానాలు బెంగళూరుకు, పాట్నా-– హైదరాబాద్ విమానం సర్వీస్‌ను విజయవాడకు మళ్లించారు.
