గంటకు 50కి.మీ. వేగంతో .. నేడు, రేపు అతి భారీ వర్షాలు

గంటకు 50కి.మీ. వేగంతో ..  నేడు, రేపు అతి భారీ వర్షాలు
  • నేడు, రేపు అతి భారీ వర్షాలు 
  • గంటకు 50కి.మీ. వేగంతో గాలులు వీస్తయ్​
  • పొలాలకు వెళ్లే  రైతులు జాగ్రత్తగా ఉండాలి: వాతావరణ శాఖ
  • ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు ఫోన్లు వాడొద్దని సూచన
  • రెడ్​ అలర్ట్​ను కొనసాగిస్తున్నం

హైదరాబాద్​, వెలుగు: బుధవారం, గురువారం రెండు రోజులూ రాష్ట్రానికి రెడ్​అలర్ట్​ను కొనసాగిస్తున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. అది మరింత బలపడి బుధవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.  12 జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తొలిరోజు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్​, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు.. రెండో రోజు నిజామాబాద్​, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్​, కామారెడ్డి జిల్లాలకు రెడ్​ అలర్ట్​ను ఇష్యూ చేసింది. మిగతా జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్​ను జారీ చేసింది. హైదరాబాద్​ సిటీకీ రెడ్​ అలర్ట్​నూ అలాగే కొనసాగించింది. రోజంతా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, మధ్య మధ్యలో అతి భారీ వర్షం పడి కాసేపు తెరిపినిచ్చి.. మళ్లీ కుంభవృష్టి కురిసేందుకు చాన్స్​ ఉందని తెలిపింది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. 

రైతులు పొలాలకు వెళ్తే జాగ్రత్తగా ఉండాలి

రైతులు పొలాలకు వెళ్తే జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. రసాయనిక ఎరువులు, పురుగు మందులు, కలుపు మందుల వంటివి ప్రస్తుతం వ్యవసాయంలో వాడొద్దని, తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని తెలిపింది. ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు ఫోన్లు వాడకూడదని సూచించింది. మొబైల్​ టవర్ల కింద ఉండరాదని పేర్కొంది. వీలైనంత వరకు పశువులను షెడ్​ కిందే కట్టేయాలని తెలిపింది. తడిసిన స్తంభాలు, విద్యుత్​ పరికరాలను ముట్టుకోవదని, వర్షం పడుతున్నప్పుడు విద్యుత్​ మోటార్లను ఆన్​ చేయవద్దని వాతావరణ శాఖ సూచించింది. 

ALSO READ :మేం ఉన్నది 5 శాతం.. రిజర్వేషన్లు 10 శాతం : జీవన్​రెడ్డి

కేశవరంలో 11.8 సెం.మీ.

రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం వాన దంచికొట్టింది. అన్ని జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా కేశవరంలో 11.8 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. మహబూబాబాద్​ జిల్లా పెద్దనాగారంలో 8.9, డోర్నకల్​లో 8.7, సూర్యాపేట జిల్లా శాంతినగర్​లో 7.3, గోండ్రియాలలో 7.1, కరీంనగర్​ జిల్లా తడికల్​లో 6.7, పోచంపల్లిలో 6.5, సిద్దిపేట జిల్లా గండిపల్లిలో 6.1 సెంటీమీటర్ల చొప్పన వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా పంగిడి, మెదక్​ జిల్లా వాడిల్లో 5.8 సెంటీమీటర్ల వర్షం పడింది. హైదరాబాద్​లో పొద్దున్నుంచి ముసురు పట్టింది. సాయంత్రం చిరుజల్లులు, మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా ఆసిఫ్​నగర్​లో 4.4 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. టోలిచౌకిలో 1.2 సెంటీమీటర్ల వాన పడింది.