మేం ఉన్నది 5 శాతం.. రిజర్వేషన్లు 10 శాతం : జీవన్​రెడ్డి

మేం ఉన్నది 5 శాతం.. రిజర్వేషన్లు 10 శాతం : జీవన్​రెడ్డి
  • మేం ఉన్నది 5 శాతం.. రిజర్వేషన్లు 10 శాతం
  • 60% పైగా ఉన్న బీసీలకు రిజర్వేషన్లు 25 శాతం: ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి
  • మంత్రుల్లో ముగ్గురే బీసీలు.. ఎక్కువ మంది మా రెడ్డి దొరలు, వెలమ దొరలే
  • రాజ్యాధికారం కోసం బీసీలు కూడా పోరాడాలని పిలుపు

కరీంనగర్, వెలుగు:  తాము 5 శాతం ఉంటే.. తమకు అమలవుతున్న రిజర్వేషన్లు 10 శాతమని, అదే బీసీలు 60శాతానికిపైగా ఉంటే వాళ్లకు అమలవుతున్న రిజర్వేషన్లు 25శాతమని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని మంత్రుల్లో కేవలం ముగ్గురే బీసీలు ఉన్నారని, ఎక్కువ మంది తమ రెడ్డి దొరలు, వెలమ దొరలేనని చెప్పారు. భవిష్యత్తులో రాజ్యాధికారం కోసం బీసీలు కూడా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఓబీసీ సమావేశం మంగళవారం డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన కరీంనగర్ లోని  ఇందిరా గార్డెన్స్ లో జరిగింది.

సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి మాట్లాడుతూ.. ‘‘అన్ రిజర్వుడ్ కేటగిరీలోని ఆర్థికంగా వెనకబడినవాళ్లకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విద్యా, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసింది. మన రాష్ట్రంలోనూ కేసీఆర్ వాటిని అమలు చేస్తున్నరు. రాష్ట్రంలో మేం ఉంది 5 శాతమైతే.. మాకు విద్యా ఉద్యోగాల్లో  10 శాతం రిజర్వేషన్లు కల్పించారు. 60 శాతంపైగా ఉన్న బీసీలకు రిజర్వేషన్లు 25 శాతమే కల్పించారు” అని ఆయన అన్నారు. ప్రతి లోక్ సభ సెగ్మెంట్​ పరిధిలో రెండు అసెంబ్లీ టికెట్లు బీసీలకు ఇవ్వాలని కాంగ్రెస్​ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీలకు 15 శాతం, గిరిజనులకు 10 శాతం, మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లను జనాభా ప్రకారం అమలు చేస్తున్నారని, కానీ 60 శాతానికిపైగా ఉన్న బీసీలకు 25 శాతమే ఇస్తున్నారని,  విద్యా, ఉద్యోగాల్లో బలహీన వర్గాల రిజర్వేషన్ 4‌‌0 శాతానికి పెంచుతూ మేనిఫెస్టోలో చేర్చేలా కృషి చేస్తామని చెప్పారు. 

ALSO READ :ఐటీ ఉద్యోగుల లాగ్ అవుట్.. మూడు షిఫ్టుల్లో

నేను రెడ్డినైతే ఎప్పుడో సీఎం అవుతుంటి: వీహెచ్​

తాను రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాడినైతే ఎప్పుడో సీఎంను అయ్యేవాడినని కాంగ్రెస్​ సీనియర్​ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. చెన్నారెడ్డి సీఎంగా ఉన్న సమయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరిగిందని చెప్పారు. ‘‘బీసీ ప్రధాని అయ్యిండని నేను సంతోషించిన. కానీ మోదీ బీసీల గురించి ఎన్నడూ పట్టించుకోలేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ పార్టీలోనే న్యాయం జరిగింది” అని చెప్పారు. 

ప్రతి లోక్​సభ సెగ్మెంట్​ పరిధిలో 3 అసెంబ్లీ సీట్లు బీసీలకు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఎన్నికల కమిటీలో పొన్నం ప్రభాకర్​కు స్థానం కల్పించకపోవ డం బాధాకరమేనని, ఈ మీటింగ్​కు ఆయన వస్తే బాగుండేదని వీహెచ్​ అన్నారు. పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయరమణారావు ఎన్నాళ్లు పోటీ చేస్తారని, తమకు అవకాశాలు ఎప్పుడు వస్తాయని కాంగ్రెస్ నేత ఈర్ల కొమురయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ కేటగిరీలో తనకు పెద్దపల్లి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో  ఎమ్మెల్యే శ్రీధర్  బాబు తదితరులు పాల్గొన్నారు.