- ఒక్కరోజే 1,862 వ్రతాలు
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. కార్తీకమాసం చివరి వారానికి తోడు ఆదివారం సెలవు కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. రద్దీ కారణంగా స్వామివారి ధర్మదర్శనానికి నాలుగు, స్పెషల్ దర్శనానికి గంటన్నర సమయం పట్టిందని భక్తులు తెలిపారు. దర్శనం అనంతరం కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. శివాలయంలో శివకేశవులకు రుద్రాభిషేకం, బిల్వ పత్రాలతో అర్చన చేశారు.
కార్తీకమాసం చివరి వారం కావడంతో సత్యనారాయణస్వామి వ్రతాలు జరిపించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో వ్రత మండపాలు కిక్కిరిశాయి. ఆదివారం ఒక్కరోజే 1,862 మంది దంపతులు వ్రతాలు నిర్వహించుకున్నారు. వ్రతాలు నిర్వహించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో మొత్తం ఏడు బ్యాచ్‌లలో వ్రతాలు జరిపారు. ఆదివారం ఒక్కరోజే 1,862 వ్రతాలు జరుగా.. వీటి ద్వారా రూ.18.62 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
రికార్డు స్థాయి ఆదాయం, భక్తులు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం రికార్డు స్థాయిలో భక్తులు రాగా, ఆదాయం సైతం భారీ మొత్తంలో వచ్చింది. ఆదివారం ఒక్క రోజే 1,06,700 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆఫీసర్లు తెలిపారు. అలాగే కార్తీక మొక్కు పూజలు, నిత్యకైంకర్యాల ద్వారా ఆలయానికి రికార్డు స్థాయిలో రూ.1,04,52,688 ఆదాయం వచ్చింది. ఆలయ చరిత్రలో ఇప్పటివరకు ఇదే అత్యధికంగా ఆదాయం, అత్యధికంగా భక్తుల రాక అని ఆఫీసర్లు చెప్పారు.
