సందర్శకులతో సందడిగా జూ పార్క్

సందర్శకులతో సందడిగా జూ పార్క్
  • గతంతో పోలిస్తే 30 శాతం పెరిగిన రద్దీ
  • వీకెండ్స్​లో 10 వేల నుంచి 15 వేల మందికి పైగానే
  • వేసవి సెలవులు ఉండటంతో పిల్లలను తీసుకొస్తున్న పేరెంట్స్

హైదరాబాద్, వెలుగు: వేసవి సెలవుల నేపథ్యంలో జూపార్కుకు సందర్శకుల తాకిడి రోజురోజుకి పెరుగుతోంది. గతంలో శని, ఆదివారాల్లో మాత్రమే రద్దీ కనిపించేది. ప్రస్తుతం స్కూళ్లకు సెలవులు ఉండటంతో పేరెంట్స్ తమ పిల్లలను జూపార్కుకు తీసుకొస్తున్నారు. మాములు రోజుల్లోనూ పార్కును విజిట్ చేసే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోందంటూ జూ అధికారులు చెప్తున్నారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు ఐదారువేల మంది వస్తుండగా.. శని, ఆదివారాల్లో ఈ సంఖ్య 10 వేలకు పైగానే ఉందంటున్నారు.  సిటీతో పాటు శివారు ప్రాంతాల నుంచి జనాలు వస్తుండటంతో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా పార్కు లోపల అధికారులు ఏర్పాట్లు చేశారు. కరోనా రూల్స్ పాటిస్తూ మాస్క్​ను తప్పనిసరి చేశారు.  ప్లాస్టిక్ వస్తువులను లోపలికి తీసుకెళ్లనివ్వట్లేదు. రద్దీ పెరుగుతుండటంతో నడుచుకుంటూ వెళ్లే వారికి ఇబ్బంది కలుగుతుందని పార్కులో సైక్లింగ్​ను ఆపేసినట్లు అధికారులు చెప్తున్నారు. వేసవి కావడంతో లోపల సేదతీరేందుకు బెంచీలు, డ్రింకింగ్ వాటర్ పాయింట్లను పెంచామన్నారు.

కరోనా తీవ్రత తగ్గడంతో..
రెండేళ్లుగా కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్​ ఎఫెక్ట్​తో వేసవి సెలవుల్లో లాక్ డౌన్ కారణంగా బయటికెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. ఈసారి కరోనా తీవ్రత తగ్గడంతో పేరెంట్స్ తమ పిల్లలను సిటీలోని టూరిస్ట్ ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు.   పిల్లలతో సరదాగా గడిపేందుకు జూ పార్కుకు వస్తున్నారు.  ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్కు తెరిచి ఉంటుండగా.. మంగళవారం నుంచి శుక్రవారం వరకు పెద్దలకు ఎంట్రీ టికెట్ రూ.60, చిన్నారులకు రూ.40,  శని, ఆదివారాల్లో పెద్దలకు రూ. 75, పిల్లలకు రూ. 50గా ఉంది.  సందర్శకులు తిరిగేందుకు బ్యాటరీ వెహికల్స్​ను అందుబాటులో ఉంచారు.

రెండు వారాల నుంచి ఫుల్ రష్
రెండు వారాల నుంచి  జూ పార్కులో రద్దీ పెరుగుతోంది. సందర్శకులకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు  ఏర్పాటు చేశాం.  ప్రతి ఎన్‌‌క్లోజర్ దగ్గర సిబ్బందిని ఉంచాం.  ప్రస్తుతం 32 బ్యాటరీ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి.  సాధారణ రోజుల్లో 15 వెహికల్స్ మాత్రమే అవసరమయ్యేవి. ప్రస్తుతం రద్దీ పెరగడంతో 25 వెహికల్స్​ను వాడుతున్నాం. 
- ఎస్. రాజశేఖర్, క్యురేటర్, నెహ్రూ జూలాజికల్ పార్కు

పిల్లలతో సరదాగా.. 
కరోనా ఎఫెక్ట్​తో రెండేళ్లుగా వేసవి సెలవుల్లో పిల్లలను ఎక్కడికి తీసుకెళ్లలేదు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు రావడంతో గతవారం జూ పార్కుకు తీసుకెళ్లా. ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లలతో సరదాగా గడిపాం. 
- నవీన్ కుమార్, వ్యాపారి