- 6,431 ప్రత్యేక బస్సులు..153 స్పెషల్ ట్రైన్లు
- విజయవాడ హైవేపైట్రాఫిక్ కంట్రోల్‌కు డ్రోన్లు
- కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మానిటరింగ్
- పంతంగి టోల్ గేట్ వద్ద ప్రయోగాత్మకంగా అమలు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: సంక్రాంతి నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే వారితో హైదరాబాద్ నగరంలోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు రద్దీగా మారాయి. స్టూడెంట్లకు సంక్రాంతి సెలవులు ఇవ్వడం, ఉద్యోగులకు వరుస సెలవులు రావడంతో పండుగ ఎంజాయ్ చేసేందుకు కుటుంబసభ్యులతో సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, చర్లపల్లి, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లతో పాటు జేబీఎస్, ఎంజీబీఎస్, కేపీహెచ్‌బీ, ఆరామ్‌ఘర్, ఎల్బీనగర్, ఉప్పల్ బస్స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి.
సిటీ ఔట్ స్కర్ట్స్ నుంచే ఆర్టీసీ బస్సులు
సంక్రాంతి కోసం టీజీఎస్ ఆర్టీసీ 6,431 స్పెషల్ బస్సులు నడుపుతున్నది. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ఈ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. పండుగ తర్వాత తిరిగి వచ్చేవారి కోసం 18, 19వ తేదీల్లోనూ ఆర్టీసీ తగిన ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీతో పాటు అటు ప్రైవేట్ బస్సుల నిర్వాహకులు చార్జీలు భారీగా పెంచేశారు. స్పెషల్ బస్సులు రిటర్న్ వచ్చేటప్పుడు ఖాళీగా ఉంటాయని, డీజిల్, మెయింటెనెన్స్ మేరకు టికెట్ ధరలు పెంచాల్సి వస్తున్నదని అధికారులు తెలిపారు. ఈ నెల 9, 10, 12, 13వ తేదీలతో పాటు తిరుగు ప్రయాణంలో రద్దీ ఎక్కువగా ఉండే 18, 19వ తేదీల్లో మాత్రమే సవరించిన చార్జీలు అమల్లో ఉంటాయి. ఇదే అదునుగా ప్రైవేటు బస్సుల నిర్వాహకులు కూడా చార్జీలు భారీగా పెంచేశారు.
రైల్వే స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు
దక్షిణ మధ్య రైల్వే 153 స్పెషల్ ట్రైన్లు నడుపుతున్నది. నెల రోజుల ముందే ఈ ట్రైన్లను ప్రకటించిన రైల్వే శాఖ.. టికెట్ల బుకింగ్ కూడా ప్రారంభించింది. ఇప్పటికే చాలా రైళ్లలో రిజర్వేషన్లు ఫుల్ అయిపోయాయి. సికింద్రాబాద్ నుంచి రోజుకు సగటున 2.20 లక్షల మంది, లింగంపల్లి నుంచి 50 వేల మంది, చర్లపల్లి నుంచి 35 వేల మంది జర్నీ చేస్తున్నారు. టికెట్ల కొనుగోలు, రైలు ఎక్కేటప్పుడు తొక్కిసలాట జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని రైల్వే సీఆర్వో శ్రీధర్ తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో 17 బుకింగ్ కౌంటర్లు, 20 ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్లు ఏర్పాటు చేశామన్నారు. రైల్ వన్ మొబైల్ యాప్‌తో ఆన్ రిజర్వ్ డ్ టికెట్ బుక్ చేసుకుంటే 3% తగ్గింపు ఉందని తెలిపారు. ఇది 14 జనవరి నుంచి 18 వరకు అమల్లో ఉంటుందని చెప్పారు.
