కిటకిటలాడిన ఆలయాలు..యాదగిరిగుట్ట,కొమురవెల్లి, వేములవాడల్లో భక్తుల రద్దీ

కిటకిటలాడిన ఆలయాలు..యాదగిరిగుట్ట,కొమురవెల్లి, వేములవాడల్లో భక్తుల రద్దీ

 

  • యాదగిరిగుట్టలో ధర్మదర్శనానికి 3, స్పెషల్‌‌ దర్శనానికి గంట టైం
  • కొమురవెల్లి, వేములవాడల్లో భక్తుల రద్దీ

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీ నర్సింహస్వామి ఆలయంతో ఆదివారం భక్తులతో కిటకిటలాడాయి. వేసవి సెలవులు రావడంతో హైదరాబాద్‌‌ సహా, రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. కొండ కింద పార్కింగ్‌‌ ఏరియా, కొండపైన బస్‌‌ బే పూర్తిగా నిండడంతో కొండపైకి వాహనాలను నిలిపివేశారు. భక్తుల రద్దీ కారణంగా లక్ష్మీనారసింహుడి ధర్మ దర్శనానికి మూడు గంటలు, స్పెషల్ దర్శనానికి గంట టైం పట్టిందని భక్తులు తెలిపారు. గుట్టలో ఇకపై స్వామివారి దర్శనానికి స్వయంగా వచ్చే వీఐపీలు, ప్రముఖులకు మాత్రమే ప్రొటోకాల్‌‌ దర్శనాలు ఉంటాయని ఈవో వెంకట్‌‌రావు ప్రకటించారు.

మల్లన్న, రాజన్న ఆలయాల్లో...

కొమురవెల్లి/వేములవాడ : కొమురవెల్లి ఆలయ ప్రాంగణం ఆదివారం మల్లన్న నామస్మరణతో మారుమోగింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు పట్నం వేసి, బోనాలు చేసి, గంగిరేగు చెట్టుకు ముడుపులు కట్టి మొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం మల్లన్న గుట్టపైన కొలువైన రేణుక ఎల్లమ్మ, నల్ల పోచమ్మకు పూజలు చేశారు. కొమురవెల్లి మల్లన్నను బీసీసీఐ, హెచ్‌‌సీఏ పిచ్‌‌ క్యూరేటర్‌‌ వైఎల్‌‌. చంద్రశేఖర్‌‌ దర్శించుకున్నారు. వేములవాడలో సైతం ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజామున నుంచే భక్తులు తలనీలాల సమర్పించి, ధర్మగుండంలో స్నానమాచరించారు. అనంతరం క్యూలైన్‌‌ గుండా స్వామివారిని దర్శించుకొని, కోడెలు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి ధర్మదర్శనానికి 3 గంటలు, బ్రేక్‌‌ దర్శనానికి గంటకు పైగా పట్టిందని భక్తులు తెలిపారు. రాజరాజేశ్వరస్వామిని తెలంగాణ హైకోర్టు జడ్జి మధుసూదన్‌‌రావు, సైబర్‌‌ క్రైం అడిషనల్‌‌ ఎస్పీ చంద్రకాంత్‌‌ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.