ఇంటిపై భారీ హిమపాతం.. ఒకే కుటుంబంలో 9 మంది మృతి

ఇంటిపై భారీ హిమపాతం.. ఒకే కుటుంబంలో 9 మంది మృతి

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌‌లో భారీ హిమపాతం సంభవించి, ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మరణించారు. చిత్రాల్ జిల్లా దక్షిణ భాగంలోని సెరిగల్ గ్రామంలోని డామిల్ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో 20 అంగుళాలకు మించి హిమపాతం కురిసింది. 

ఆ తర్వాత సమీపంలోని పచ్చిక భూమి నుంచి భారీ మంచు రాళ్లు జారి.. ఓ ఇంటిని కప్పేసింది. దీంతో ఆ ఇంట్లో ఉన్న ఇంటి యజమాని, అతని భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కోడళ్లు అక్కడికక్కడే మృతిచెందారు. వారు ఇంటి మధ్య గదిలో భోజనం చేస్తున్న సమయంలో ఈ దారుణం సంభవించింది. 

తొమ్మిదేండ్ల బాలుడు బతికి బయటపడ్డాడని, శిథిలాల నుంచి బయటకు తీసి వెంటనే ఆస్పత్రికి తరలించినట్టు లోయర్ చిత్రాల్ డిప్యూటీ కమిషనర్ హషీమ్ అజీమ్  తెలిపారు. ఇదిలా ఉండగా.. పాకిస్తాన్‌‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్, గిల్గిట్-బాల్టిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లో భారీ హిమపాతం కారణంగా జనజీవం స్తంభించిపోయింది. 

చిత్రాల్ లోయలో 36 గంటల నుంచి నిరంతరం హిమపాతం కురుస్తూనే ఉంది. రోడ్లు మూసుకుపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఉష్ణోగ్రతలు మైనస్ 20 డిగ్రీలకు పడిపోయాయి. భూకంప బాధితులు టెంట్లలో కష్టాలు ఎదుర్కొంటున్నారు.