KPHB నుంచి హైటెక్ సిటీ వరకు ట్రాఫిక్ జాం.. ఐదు కిలోమీటర్లకు గంట సమయం

KPHB నుంచి హైటెక్ సిటీ వరకు ట్రాఫిక్ జాం.. ఐదు కిలోమీటర్లకు గంట సమయం

హైదరాబాద్ సిటీలో మళ్లీ ట్రాఫిక్ హర్రర్ తో ప్రయాణికులకు చుక్కలు చూస్తున్నారు. వారం రోజుల సెలవుల తర్వాత అందరూ ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. వరసగా వర్షాల సెలవులు తర్వాత ఉద్యోగస్తులంతా ఉదయమే రోడ్డెక్కేశారు. దీంతో 2023 జులై 31 సోమవారం హైదరాబాద్ సిటీ మొత్తం ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. ముఖ్యంగా ఐటీ కారిడార్ లో వాహనదారుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. కూకట్ పల్లి, హౌసింగ్ బోర్డు, ప్రగతినగర్, నిజాంపేట ఏరియాల్లోని ఐటీ ఎంప్లాయిస్, వ్యాపారస్తులు అందరూ ఒక్కసారిగా తమ వాహనాలతో రోడ్డుపైకి వచ్చారు. 

వేలాది కార్లు, బైక్స్, క్యాబ్స్ రోడ్డు మీదకు రావటంతో.. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు నెక్లస్ ఫ్లైఓవర్ నుంచి హైటెక్ సిటీ వరకు నాలుగు కిలోమీటర్లు ట్రాఫిక్ స్తంభించింది. చాలా నిదానంగా వాహనాలు కదులుతున్నాయి. జేఎన్ టీయూ నుంచే వాహనాల రద్దీ నెలకొంది. రైతు బజార్ దాటిన తర్వాత ఫ్లైఓవర్ పైన కూడా వాహనాలు ఆగిపోతున్నాయి. దీంతో నాలుగు కిలోమీటర్ల జర్నీకి 45 నిమిషాల సమయం పడుతోందని ప్రయాణికులు చెబుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఉన్నా.. వాహనాలు అధిక సంఖ్యలో ఉండటంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది.