4 మ్యాచ్‌లకే రిటైర్మెంట్.. సన్ రైజర్స్ బ్యాటర్ సంచలన నిర్ణయం

4 మ్యాచ్‌లకే రిటైర్మెంట్.. సన్ రైజర్స్ బ్యాటర్ సంచలన నిర్ణయం

సుదీర్ఘ ఫార్మాట్ గా టెస్ట్ క్రికెట్ కు పేరుంది. పరిమిత ఓవర్ల క్రికెట్ ఫ్యాన్స్ కు ఎంత కిక్ ఇచ్చినా టెస్ట్ మ్యాచ్ లు ఆడితేనే ఒక ఆటగాడి సమర్థత తెలుస్తుంది. దిగ్గజాలు సైతం టెస్టు క్రికెట్ నే ఎక్కువగా ఇష్టపడతారు. అయితే ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ పరిస్థితి అద్వానంగా తయారవుతోంది. పట్టుమని పాతికేళ్ళు లేకుండా, కనీసం 10 టెస్టులైనా ఆడకుండా రిటైర్మెంట్ ప్రకటించేస్తున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా విధ్వంసకర వీరుడు హెన్రిచ్ క్లాసెన్ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

పరిమిత ఓవర్ల క్రికెట్ లో దక్షిణాఫ్రికా తరపున అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన క్లాసెన్.. తన కెరీర్‌లో కేవలం నాలుగు టెస్టులు మాత్రమే ఆడాడు. 2019లో రాంచీ వేదికగా భారత్‌పై అరంగేట్రం తొలి టెస్ట్ ఆడిన క్లాసన్.. 2023లో వెస్టిండీస్‌పై తన చివరి టెస్ట్ ఆడాడు. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ నాలుగు టెస్టుల్లో 13 యావరేజ్ తో 104 పరుగులు చేశాడు. సిడ్నీలో ఆస్ట్రేలియాపై చేసిన 35 పరుగులు క్లాసన్ టెస్టు కెరీర్ లో అత్యధికం.  

టెస్ట్ క్రికెట్ కు దూరమైనా వైట్-బాల్(వన్డే, టీ20) ఫార్మాట్‌లలో కొనసాగుతానని చెప్పుకొచ్చాడు. ఇది కఠినమైన నిర్ణయమని.. తన ఫేవరేట్ ఫార్మాట్ నుండి రిటైర్ అవుతున్నందుకు బాధగా ఉందని క్లాసన్ వెల్లడించాడు. ఇది గొప్ప ప్రయాణం.. దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు నేను సంతోషిస్తున్నాని తెలియజేశాడు. ఇదిలా ఉండగా.. క్లాసన్ ఇటీవలే భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో సత్తా చాటాడు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ తరపున ఆడుతున్న ఈ సఫారీ బ్యాటర్ పై భారీ అంచనాలే ఉన్నాయి.