వచ్చే ఎన్నికల్లో ఎంట్రీకి వారసుల ఏర్పాట్లు

V6 Velugu Posted on Jan 14, 2022

  • ఇప్పటి నుంచే ఏర్పాట్లు
  • జనానికి చేరువయ్యేందుకు ప్రయత్నాలు
  • వాళ్లకు టికెట్లు ఇప్పించే పనిలో లీడర్లు
  • టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ.. అన్ని పార్టీల్లో ఇదే ట్రెండ్​ 

వచ్చే అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికల్లో లీడర్ల వారసులు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయితున్నరు. ఇప్పటి నుంచే జనానికి చేరువయ్యే పనిలో పడ్డరు. కొందరు లాస్ట్​ టైమే ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నించినా.. సక్సెస్​ కాలేదు. దీంతో ఇప్పుడు రాబోయే ఎన్నికలపై ఫోకస్​ పెట్టిన్రు. పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేతల కుటుంబసభ్యులు ఏ చిన్న చాన్స్​ దొరికినా వదిలిపెట్టకుండా సభలు, సమావేశాల్లో పాల్గొంటున్నరు. ‘‘రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిని నేనే’’ అనే సంకేతాలను పంపుతున్నరు. లీడర్ల అనుచర గణం కూడా ‘‘వచ్చే ఎన్నికల్లో మా లీడర్​ ప్లేస్ లో వాళ్ల కొడుకు లేదా బిడ్డ పోటీ చేస్తరు’’ అంటూ  గ్రౌండ్​ లెవల్​లో ప్రచారం చేస్తున్నరు.

హైదరాబాద్, వెలుగు: రాజకీయ కార్యక్రమాల్లో వారసులు బిజీగా తిరుగుతున్నారు. రాబోయే ఎలక్షన్స్​లో పోటీ చేసేందుకు రెండేండ్ల ముందు నుంచే ప్రిపేర్​ చేసుకుంటున్నారు. ఈ వాతావరణం చాలా సెగ్మెంట్లలో కనిపిస్తున్నది. ఇందుకు ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేదు. అధికార టీఆర్ఎస్​లో ఇది కొద్దిగా ఎక్కువగానే ఉంది. కాంగ్రెస్, బీజేపీలోనూ కనిపిస్తున్నది. 
టీఆర్​ఎస్​లో మస్తు మంది..!
నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నుంచి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్​రెడ్డి స్థానంలో ఆయన కొడుకు, ప్రస్తుత డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి పోటీకి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఆయన విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. గత ఎన్నికల్లోనే కొడుకు కోసం టికెట్ అడిగినా సీఎం కేసీఆర్ మాత్రం శ్రీనివాస్ రెడ్డినే బరిలో నిలవాలని ఆదేశించారు. ఇప్పుడు మాత్రం కొడుకును ఎమ్మెల్యే చేయాలనే పట్టుదలతో పోచారం ఉన్నట్లు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతున్నది. నిజామాబాద్ రూరల్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆర్టీసీ చైర్మన్  బాజిరెడ్డి గోవర్ధన్ కూడా ఈసారి తన కొడుకును బరిలో నిలిపేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయన కొడుకు జగన్ మోహన్ ప్రస్తుతం దర్పల్లి జెడ్పీటీసీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కొడుక్కు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి పోటీ చేయించాలని గోవర్ధన్  ప్రయత్నిస్తున్నారు. జగన్ కూడా నియోజకవర్గమంతా కలియ తిరుగుతూ జనాలకు చేరువయ్యే కార్యక్రమాలు చేపడుతున్నారు. 
మండలి మాజీ చైర్మన్​, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్​ రెడ్డి కొడుకు మిత్​రెడ్డి నల్గొండ లోక్​సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.  కరీంనగర్ జిల్లా కోరుట్ల నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కల్వకుంట్ల విద్యాసాగర్ రావు.. ఈసారి తన కొడుకు డాక్టర్ సంజయ్ ని ఎమ్మెల్యే చేయాలని ప్రయత్నిస్తున్నారు. మంత్రి కేటీఆర్ కు సంజయ్​ అత్యంత సన్నిహితుడని కోరుట్ల నియోజకవర్గంలో పేరుంది. ఆదిలాబాద్  ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్న వచ్చే ఎన్నికల్లో తన కొడుకు ప్రేమేందర్ ను టీఆర్ఎస్  తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారు. ప్రేమేందర్ ప్రస్తుతం ఆదిలాబాద్ మున్సిపల్  చైర్మన్ గా కొనసాగుతున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు తన కొడుకు విజిత్ రావును టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు నియోజకవర్గంలో చర్చ సాగుతున్నది.  వరంగల్ ఉమ్మడి జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో తన కూతురు కావ్యను టీఆర్ఎస్ తరఫున బరిలో నిలిపేందుకు ఎమ్మెల్సీ, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రయత్నాలు చేస్తున్నారు.  సికింద్రాబాద్ కంటోన్మెంట్‌‌ ఎమ్మెల్యే సాయన్న స్థానంలో ఆయన కూతురు లాస్య నందిత పోటీ చేయనున్నట్లు నియోజకవర్గంలో టాక్. కవాడిగూడ కార్పొరేటర్ గా గతంలో పని చేసిన లాస్య.. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్​గా పోటీ చేసి ఓడిపోయారు. వయోభారంతో పాటు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న సాయన్న.. వచ్చే ఎన్నికల్లో కూతురుకు ఎమ్మెల్యేగా టికెట్ ఇప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు నియోజకవర్గంలో చర్చ నడుస్తున్నది.  కొత్తగూడెంలో టీఆర్ఎస్ తరఫున వనమా వెంకటేశ్వర్ రావు స్థానంలో ఆయన కొడుకు రాఘవను పోటీ చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతుండగా.. వరుస కేసుల్లో రాఘవ ఇరుక్కొని జైలుపాలు కావడంతో పొలిటికల్​ ఎంట్రీకి బ్రేక్​ పడింది.

కాంగ్రెస్  సీనియర్ నేత జానారెడ్డి తన కొడుకు రఘువీర్ రెడ్డిని నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ లేదా మిర్యాలగూడ నియోజకవర్గంలో ఏదో ఒక చోట పోటీ చేయించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత గీతారెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా కూతురు మేఘనా రెడ్డిని జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయించను న్నట్లు ప్రచారం సాగుతున్నది. మాజీ మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత వచ్చే ఎన్నికల్లో వరంగల్ ఈస్ట్  నుంచి లేదా పరకాల నుంచి పోటీ చేయనున్నట్లు ప్రచారంలో ఉంది. జనగామ అసెంబ్లీ సీటు నుంచి పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పోటీపై అనుమానాలు నెలకొన్నాయి. ఆయన కోడలు వైశాలి పోటీ చేస్తారనే ప్రచారం నడుస్తున్నది. 

బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు కొడుకు వికాస్ వచ్చే ఎన్నికల్లో సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారంలో ఉంది. వికాస్​ ఇప్పటి నుంచే నియోజకవర్గంలో  సేవా కార్యక్రమాలు చేపడుతూ జనానికి చేరువవుతున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ వచ్చే ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి పార్లమెంట్ కు పోటీ చేసే అవకాశం ఉంటే, గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన కూతురు స్నిగ్ధారెడ్డిని పోటీ చేయిస్తారనే ప్రచారం జరుగుతున్నది. చేవెళ్ల లోక్​సభ స్థానం నుంచి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. 

 

 

Tagged Telangana, Arrangements, leaders, ELECTIONS, upcoming, contest, political, young, heirs

Latest Videos

Subscribe Now

More News