
ప్రభుత్వాస్పత్రులో త్వరలోనే హెల్ప్ డెస్క్ లు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కార్పొరేట్ హాస్పిటల్స్ కు దీటుగా ప్రతి హాస్పిటల్ లో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన చాలా రోజుల నుంచి ఉంది. సాధ్యమైనంత త్వరగా వీటిని అందుబాటులోకి తెస్తామని జిల్లా వైద్యాధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా బోధనాస్పత్రులైన ఉస్మానియా, గాంధీ, నీలోఫర్ వంటి హాస్పిటల్స్ లో వీటిని ముందుగా ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత జిల్లా హాస్పిటల్స్ లోనూ వీటిని క్రమక్రమంగా అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం ఉస్మానియా, గాంధీ, ఎర్రగడ్డలోని మానసిక వికలాంగుల హాస్పిటల్స్ సహా బోధనాస్పత్రుల్లో పలు ప్రైవేట్ సంస్థలు హెల్ప్ డెస్క్ పేరుతో రోగులకు ఇప్పటికే సేవలు అందిస్తున్నాయి. జిల్లాల నుంచి వచ్చే రోగులకు, కొత్తగా వచ్చే పేషెంట్లకు హాస్పిటల్ లో ఓపీ ఎక్కడ ఉంటుందో ఏ విభాగం ఎక్కడ ఉంటుందో పేషెంట్లకు గైడ్ చేస్తున్నారు. ల్యాబ్ లు, రక్త పరీక్షలు, స్కానింగ్ లు వంటివి ఎక్కడ చేస్తారన్నది స్వయంగా పేషెంట్లను తీసుకెళ్లి చూపిస్తున్నారు. ఈ సేవలకు బోధనాస్పత్రుల్లో మంచి స్పందన రావడంతో ప్రభుత్వమే ప్రత్యేకంగా హెల్ఫ్ డెస్క్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. స్వచ్ఛంద సంస్థల సేవలు శాశ్వతం కాకపోవడంతో ప్రభుత్వ పరిధిలోనే కొంత మంది ఉద్యోగులను నియమించి ఈ సేవలు అందించనున్నారు.
జిల్లా హాస్పిటల్స్ నుంచి పీహెచ్ సీల వరకు
బోధనాస్పత్రుల్లో హెల్ఫ్ డెస్క్ లు ఎంత ముఖ్యమో జిల్లా హాస్పిటల్స్, పీహెచ్ సీలోనూ అంతే అవసరమని వైద్యాధికారులు గుర్తించారు. జిల్లా హాస్పిటల్స్ కు వచ్చే చాలా మంది పేషెంట్లను వైద్యులు పెద్దాస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. పైగా జిల్లా హాస్పిటల్స్ లో అన్ని సూపర్ స్పెషాలిటీ విభాగాలు లేకపోవడంతో తమకు వచ్చిన రోగానికి ఏ డాక్టర్ దగ్గరకు వెళ్లాలో కూడా చాలా మంది రోగులకు తెలియదు. ఇలాంటి వారికి తమకు వచ్చిన జబ్బు ఏంటీ దానికి సంబంధించిన సేవలు ఇక్కడి హాస్పిటల్ లో ఉన్నాయా లేదా ఏ డాక్టర్వద్దకు వెళ్లాలన్నది సూచించేందుకు జిల్లా హాస్పిటల్స్ లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని అన్ని జిల్లా హాస్పిటల్స్ తో పాటు 85 పీహెచ్ సీలోనూ రోగుల సహాయ కేంద్రాలు సిద్ధం చేయనున్నారు. జిల్లా హాస్పిటల్ గానీ పీహెచ్ సీ లకు వచ్చే రోగులకు గానీ వారి సమస్యను బట్టి పెద్దాస్పత్రికి వెళ్లాల్సి వస్తే వారికి సంబంధించిన సమాచారాన్ని హెల్ఫ్ డెస్క్ ద్వారా పెద్దాస్పత్రిలోని సంబంధిత డాక్టర్ కు హెల్ఫ్ డెస్క్ సభ్యులే ఫోన్ ద్వారా వివరిస్తారు. నేరుగా ఆయా విభాగాల డాక్టర్లను కలిసే విధంగా ఏర్పాట్లు చేస్తారు.