ఇవేం చెత్త వార్తలు.. నా భర్త చనిపోలేదు: ధర్మేంద్ర భార్య హేమ మాలిని ఆగ్రహం

ఇవేం చెత్త వార్తలు.. నా భర్త చనిపోలేదు: ధర్మేంద్ర భార్య హేమ మాలిని ఆగ్రహం

ముంబై: బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర మృతి చెందినట్లు జరుగుతోన్న ప్రచారంపై ఆయన సతీమణి, సీనియర్ యాక్టర్ హేమ మాలిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్త మృతి చెందలేదని.. ఆయన ఆసుప్రతిలో చికిత్స పొందుతున్నారని క్లారిటీ ఇచ్చారు. ఆయన ట్రీట్మెంట్‎కు రెస్పాండ్ అవుతున్నారని.. త్వరగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ధరేంద్ర చనిపోయినట్లు జరుగుతోన్న ప్రచారం క్షమించరానిదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చికిత్సకు స్పందిస్తూ కోలుకుంటున్న వ్యక్తి గురించి బాధ్యతాయుతమైన ఛానెల్‌లు ఇలా తప్పుడు వార్తలను ఎలా వ్యాప్తి చేయగలవని ప్రశ్నించారు. ఇది చాలా అగౌరవం, బాధ్యతారహితంగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. దయచేసి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మా కుటుంబ గోప్యతకు తగిన గౌరవం ఇవ్వండని విజ్ఞప్తి చేశారు. ధర్మేంద్ర, హేమ మాలినిల పెద్ద కుమార్తె ఇషా డియోల్ కూడా తండ్రి మరణ వార్త పుకార్లను తోసిపుచ్చారు. మీడియా అతిగా తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తోందని ఇషా మండిపడింది. నాన్న ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆయన కోలుకుంటున్నారని వెల్లడించింది.

 మా కుటుంబానికి గోప్యత ఇవ్వాలని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నామని విజ్ఞప్తి చేసింది. కాగా, గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ప్రముఖ నటుడు ధరేంద్ర మృతి చెందినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పలువురు ప్రముఖులు కూడా సంతాపం తెలిపారు. ఈ క్రమంలో ధర్మేంద్ర మరణ పుకార్లపై ఆయన భార్య, కూతురు  క్లారిటీ ఇచ్చారు. దీంతో ధరేంద్ర మరణించాడన్న పుకార్లకు చెక్ పడింది.