ముఖ్యమంత్రి కారు, డబ్బులు సీజ్ : మిస్సింగ్ అంటూ ఈడీ ప్రకటన

ముఖ్యమంత్రి కారు, డబ్బులు సీజ్ : మిస్సింగ్ అంటూ ఈడీ ప్రకటన

ముఖ్యమంత్రి మిస్సింగ్. . ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాంటి వార్త విన్నారా.. దేశంలో ఫస్ట్ టైం.. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి మిస్సింగ్ అంటూ ఈడీ.. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రకటించటం సంచలనంగా మారింది. మిస్సింగ్ అయిన ఆ సీఎం ఎవరో కాదు.. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అంట. 48 గంటలుగా అందుబాటులో లేరని.. ఫోన్ స్వచ్ఛాఫ్ అయ్యిందని.. ఢిల్లీలోని సీఎం అధికార నివాసంలోని కారు, 36 లక్షల డబ్బుతోపాటు కొన్ని డాక్యుమెంట్లు సీజ్ చేసినట్లు వెల్లడించింది ఈడీ. ముఖ్యమంత్రి మిస్సింగ్ అని ప్రకటించటంపై జార్ఖండ్ ప్రజలు షాక్ అవ్వటమే కాదు.. ఆయన పార్టీ జేఎంఎం సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ముఖ్యమంత్రి మిస్సింగ్ అని ఈడీ ఎలా ప్రకటిస్తుందంటూ ఎదురుదాడి చేస్తుంది. 

ఇంతకీ కేసు ఏంటీ :

రాతి గనుల మైనింగ్ లీజును తనకు అనుకూలమైన వారికి కట్టబెట్టటంతోపాటు అధిక ధరలకు కేటాయించిన విషయంపై కేసు నమోదైంది. మైనింగ్ లీజుతోపాటు విదేశాల నుంచి డబ్బు అక్రమంగా దేశంలోకి వచ్చిందని.. దానికి లెక్కలు చూపించలేదనే మనీలాండరింగ్ కేసు కూడా ఉంది సోరెన్ పై. అదే విధంగా సంస్థలకు భూముల కేటాయింపు ద్వారా అధిక లబ్ధి పొందారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు హేమంత్ సోరెన్. ఈ కేసులన్నిటిపై ఇప్పటికే ఈడీ విచారణ చేస్తుంది. 

బీఎండబ్ల్యూ కారు సీజ్ 

మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను విచారించేందుకు ఈడీ అధికారులు 2024 జనవరి 29వ తేదీ  సోమవారం ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసానికి వెళ్లారు. అయితే సీఎం సోరెన్ అందుబాటులో లేకపోవడంతో సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. సీఎం హేమంత్ కావాలనే విచారణకు రావడంలేదని ఈడీ తెలిపింది.  సోరెన్  కుటుంబ సభ్యులు మాత్రం వ్యక్తిగత పనిమీద వెళ్లారంటున్నారు.  దీంతో అక్రమంగా కొన్నట్లు భావిస్తున్న బీఎండబ్ల్యూ కారును, కొన్ని డాక్యుమెంట్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. కాగా ఈడీ ఇప్పటివరకూ 7 సార్లు సమన్లు జారీ చేయగా, సోరెన్ విచారణకు హాజరుకాలేదు.  మరోవైపు అరెస్టు భయంతో సీఎం సోరెన్ 24  గంటలు పరారీలో ఉన్నారని బీజేపీ ఆరోపించింది.