అరెస్టును సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన హేమంత్ సోరెన్

అరెస్టును సవాల్ చేస్తూ..  సుప్రీంకోర్టును ఆశ్రయించిన హేమంత్ సోరెన్

భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ జార్ఖండ్ మాజీ సీఎం  హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు  2024 ఫిబ్రవరి 2 శుక్రవారం రోజున విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం అంగీకరించింది. సోరెన్‌ తరఫు సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్‌, అభిషేక్‌ సింఘ్వీలు జార్ఖండ్‌ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపారు.

ముఖ్యమంత్రి పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేసిన కొద్దిసేపటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయన్ను  అరెస్టు చేసింది. భూ కుంభకోణం కేసుకు సంబంధించి ఏడు గంటలకు పైగా విచారణ అనంతరం అదుపులోకి తీసుకుంది. ప్రభుత్వ భూములను అక్రమంగా ప్రైవేట్ వ్యక్తుల పేరిట మార్చి.. రూ. 600 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని నమోదైన ఈ కేసులో మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకూ ఒక ఐఏఎస్ ఆఫీసర్ సహా 14 మంది అరెస్ట్ అయ్యారు.