
హీరోగానే కాక మనసున్న మనిషిగానూ మన్ననలు అందుకుంటున్నాడు మహేష్ బాబు. తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయించాడు. ఆయన చేస్తున్న ఈ గొప్ప పనిలో ఇప్పుడు ఆయన అభిమానులు కూడా భాగమయ్యారు. మహేష్ బాబు పుట్టినరోజును ప్రతి యేటా మెమొరబుల్‌గా జరుపుకుంటారు ఫ్యాన్స్. ముఖ్యంగా చారిటీ కార్యక్రమాలతో ఆ రోజుకున్న విలువను పెంచుతారు. తాజాగా మహేష్ ఫౌండేషన్‌కి భారీ విరాళం ప్రకటించారు. మహేష్ బర్త్ డే (ఆగస్టు 9) సందర్భంగా తన ఆల్ టైమ్ రికార్డ్స్‌లో ఒకటైన ‘పోకిరి’ చిత్రాన్ని 4కె రిజల్యూషన్‌తో రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. వరల్డ్ వైడ్‌గా మూడు వందల డెబ్భై ఐదు షోస్ వేయగా, వాటిలో మూడు వందల యాభైకి పైగా షోస్ హౌస్‌ఫుల్ అయ్యాయి. దీంతో కోటీ డెబ్భై మూడు లక్షలు వసూళ్లయ్యాయి.
సినిమా వచ్చి పదహారేళ్లు దాటినా ఈ రేంజ్‌లో కలెక్షన్స్ రావడం విశేషం. అయితే ఆ మొత్తాన్ని వాళ్లెవరూ తీసుకోలేదు. మహేష్ బాబు ఫౌండేషన్‌కి ఇచ్చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పిల్లల హార్ట్ ఆపరేషన్స్, పేద విద్యార్థుల చదువుకు ఈ డబ్బును ఉపయోగించాలని కోరారు. అలాగే అందులో పది లక్షల రూపాయలను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ ట్రస్ట్‌కి విరాళంగా కూడా ప్రకటించారు. ఈ సహాయానికి సపోర్ట్ చేసిన పూరి జగన్నాథ్‌కి, డిస్ట్రిబ్యూటర్స్‌కి ఫ్యాన్స్ థ్యాంక్స్ చెప్పారు. నిజమైన అభిమానమంటే ఎలా ఉంటుందో చూపించారు.