
వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్న నాని, ఒకటి పూర్తవగానే మరో సినిమాపై ఫోకస్ పెడుతున్నాడు. ఇటీవల ‘అంటే సుందరానికీ’ షూటింగ్ పూర్తి చేసిన నాని, ప్రస్తుతం ‘దసరా’ చిత్రంలో నటిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. గోదావరిఖని బొగ్గు గనుల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. నాని తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పబోతున్నాడు. నిన్న ఈ మూవీ నుంచి నాని లుక్‌ను రివీల్ చేస్తూ ‘స్పార్క్ ఆఫ్ దసరా’ పేరుతో చిన్న వీడియోను విడుదల చేశారు. ఇందులో లుంగీ పైకి కట్టి ఊరమాస్ గెటప్‌లో కనిపిస్తున్న నాని.. తల నుంచి కారుతున్న రక్తం, నడుముకు కట్టిన లిక్కర్ సీసాలతో బొగ్గు గనుల మధ్యలో నడిచొస్తున్నాడు. భగ భగ మండుతున్న మంటల్లో చేయి పెట్టి సిగరెట్ వెలిగించుకున్నాడు. తన వెనుక కొందరు అనుచరులు నడిచొస్తున్నారు. సాలిడ్ యాక్షన్ సీన్ తర్వాత వచ్చే విజువల్స్ ఇవని అర్థమవుతోంది. నాని ట్రాన్స్‌ఫర్మేషన్ ఇంప్రెస్ చేస్తోంది. సంతోష్ నారాయణన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ సీన్‌ని మరింత ఎలివేట్ చేస్తోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.