- ప్రిస్క్రిప్షన్ లేకున్నా అమ్మకానికి గర్భస్రావ కిట్లు
- సొమ్ముచేసుకుంటున్న మెడికల్ షాపులు, ఆర్ఎంపీలు
- రూరల్ ఏరియాల్లో ఇష్టారీతిన జరుగుతున్న గర్భస్రావాలు
- వేలేరు, శాయంపేట మండలాల్లో పడిపోతున్న ఆడపిల్లల జననాల రేటు
- తనిఖీలు చేపడుతున్న జిల్లా అధికారులు
హనుమకొండ, వెలుగు: జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఆడపిల్లల జననాల రేటు పడిపోతున్నది. రూరల్ ఏరియాలకు చెందిన కొంతమంది కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే చాలు ఆర్ఎంపీలనో, మెడికల్ షాపులనో సంప్రదించి ఎంటీపీ (మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ) కిట్ లతో గర్భస్రావాలు చేసేస్తున్నారు. ఫలితంగా క్షేత్రస్థాయిలో అబార్షన్లు పెరిగిపోతుండగా, ఆడ పిల్లల జననాలు తగ్గిపోతున్నాయి.
ముఖ్యంగా హనుమకొండ జిల్లాలోని వేలేరు, శాయంపేట మండలాల్లో గడిచిన ఏడాది కాలంలో ఆడపిల్లల జననాల రేటు పడిపోవడంతో ఎంటీపీ కిట్ల వినియోగంపై ఆఫీసర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు క్షేత్రస్థాయి పరిస్థితులను అనాలసిస్ చేయడంతో పాటు అనుమానం ఉన్న ఆర్ఎంపీలు, మెడికల్ షాపులపై తనిఖీలు నిర్వహించి, కేసులు కూడా నమోదు చేస్తున్నారు.
ప్రిస్క్రిప్షన్ లేకున్నా అబార్షన్ కిట్..
హనుమకొండ జిల్లాతో పాటు వరంగల్ నగర వ్యాప్తంగా 550కిపైగా మెడికల్ షాపులున్నాయి. ఇందులో కొన్ని మెడికల్ షాపులు ఎంటీపీ కిట్(అబార్షన్ కిట్) లను విచ్చలవిడిగా విక్రయించడం వల్లే గర్భస్రావాలు పెరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. వాస్తవానికి గైనకాలజిస్ట్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఎంటీపీ కిట్ విక్రయించాలనే రూల్ ఉంది. కానీ, చాలా మెడికల్ షాపులు ఆ నిబంధన ఏమీ పట్టించుకోకుండా ఇష్టారీతిన అమ్ముతున్నాయి.
అంతేగాకుండా గ్రామాల్లో వైద్యసేవలందించే ఆర్ఎంపీలకు అడిగినన్ని సప్లై చేస్తున్నాయి. దీంతో ఊళ్లలో ఉండే కొంతమంది ఆర్ఎంపీలు తమ వద్దకు వచ్చేవారికి రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు తీసుకుని ఎంటీపీ కిట్లు చేతిలో పెడుతున్నారు. ఓ వైపు ఎంటీపీ కిట్లతో పాటు వరంగల్ నగరంలోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు కూడా గుట్టుగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసి, రూ.లక్షల్లో దండుకుని అబార్షన్లు కూడా చేసేస్తున్నాయి. ఫలితంగా ఆడపిల్లల జనాభా రేటు తగ్గిపోతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
రంగంలోకి దిగిన ఆఫీసర్లు..
ఆడ పిల్లల జననాలు తక్కువగా నమోదవుతుండటంతో పాటు మెడికల్ షాపులు, ఆర్ఎంపీల దందా, మరోవైపు ఎంటీపీ కిట్ల వినియోగంపై జిల్లా ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు. కలెక్టర్ స్నేహ శబరీశ్ ఆదేశాల మేరకు రూల్స్ పాటించని మెడికల్ షాపులు, ఆర్ఎంపీలకు చెక్ పెట్టడంతో పాటు ఆడ పిల్లల జననాలు తగ్గడంపై విశ్లేషించేందుకు రంగంలోకి దిగారు.
ముఖ్యంగా ఆడపిల్లల జనాభా తక్కువగా నమోదవుతున్న వేలేరు, శాయంపేట మండలాలపై ఫోకస్ పెంచారు. అక్కడి వాస్తవ పరిస్థితులను ఆరా తీయడం, నిబంధనలు పాటించని మెడికల్ షాపులు, ఆర్ఎంపీలపై యాక్షన్ తీసుకుంటున్నారు. తాజాగా శాయంపేటలోని ఓ ఆర్ఎంపీపైనా కేసు నమోదు చేశారు. ఇప్పటికే డ్రగ్ ఇన్ స్పెక్టర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 74 మెడికల్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు.
ఇందులో రూల్స్ పాటించని 37 షాపులకు పెనాల్టీలు విధించడంతో పాటు వరంగల్ నగరంలో దాదాపు 12 ఏజెన్సీల లైసెన్స్ లను రద్దు చేసేందుకు సిఫారస్ చేశారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తుండగా ఇష్టారీతిన వ్యవహరించే మెడికల్ షాపులు, ఆర్ఎంపీలపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.
రెండు మండలాల్లో ఆడపిల్లలు తక్కువ..
హనుమకొండ జిల్లాలో 17 పీహెచ్సీలు, 7 అర్బన్ హెల్త్ సెంటర్లతో పాటు రెండు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లున్నాయి. వాటితో పాటు ప్రత్యేకంగా మెటర్నిటీ సేవల కోసం హనుమకొండలో ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ఉంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నింటిలో కలిపి ఏటా సగటున 14,500 నుంచి 15 వేల వరకు డెలివరీలు జరుగుతున్నాయి.
ఇంతవరకు బాగానే ఉన్నా కొంతకాలంగా జిల్లాలోని వేలేరు, శాయంపేట మండలాల్లో ఆడపిల్లల జననాల రేటు తక్కువగా నమోదవుతోంది. స్టేట్ యావరేజ్ సెక్స్ రేషియో 942 కాగా, వేలేరు మండలంలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 874 మంది అమ్మాయిలు మాత్రమే నమోదు కావడం కలవరానికి గురి చేస్తోంది. గత నాలుగైదు ఏండ్ల నుంచి వేలేరు మండలంలో ఆడపిల్లల జననాల రేట్ తక్కువగానే ఉంటుండగా, గడిచిన ఏడాది కాలంలో శాయంపేట మండలంలో కూడా తక్కువగానే నమోదు కావడం గమనార్హం. దీంతో క్షేత్రస్థాయిలో ఎంటీపీ కిట్ల వినియోగంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎంటీపీ కిట్ల విక్రయాలపై నిఘా
జిల్లా కలెక్టర్ ఆదేశాల మెడికల్ షాపులు, ఆర్ఎంపీల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా వేలేరు, శాయంపేట మండలాలపై ఫోకస్ పెట్టాం. ముఖ్యంగా ఎంటీపీ కిట్స్ విక్రయాలపై నిఘా పెంచాం. రూల్స్ పాటించని మెడికల్ షాపులకు ఫైన్లు విధించడం, ఏజెన్సీల లైసెన్సుల క్యాన్సిల్ కు చర్యలు తీసుకుంటున్నాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
- జె.కిరణ్ కుమార్, డ్రగ్ ఇన్ స్పెక్టర్, హనుమకొండ
