- రిజర్వాయర్ లో తగ్గుతున్న నీటి సామర్థ్యం
- అత్యధిక క్యాచ్మెంట్ ఉన్న మధ్యతరహా ప్రాజెక్టుగా గుర్తింపు
- సీతమ్మసాగర్ ఆనకట్ట నిర్మాణ పనులు నిలిచిపోవడంతో నీలినీడలు
భద్రాచలం, వెలుగు : తాలిపేరు ప్రాజెక్టు రిజర్వాయర్ పూడికతీతకు నోచుకోవడం లేదు. చర్ల మండల పరిధిలో ప్రాజెక్టు నిర్మించిన నాటి నుంచి పూడికతీత పనులు చేపట్టలేదు. దీంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తుంది. తెలంగాణ –-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని 1,234 మైళ్ల పరివాహకం ఉన్న తాలిపేరు ప్రాజెక్టు అత్యధిక క్యాచ్మెంట్ ఉన్న మధ్యతరహా రిజర్వాయర్‌గా గుర్తింపు పొందింది.
ఈ ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాల్వల ద్వారా 24,700 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంటుంది. రిజర్వాయర్‌లో పేరుకుపోయిన మట్టిని తీస్తే నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది.
సీతమ్మసాగర్ఆనకట్టకు 40 లక్షల ఘనపు మీటర్ల మట్టి కేటాయింపు..
దుమ్ముగూడెం మండల పరిధిలోని గోదావరి నదిపై సీతమ్మసాగర్ ఆనకట్ట నిర్మాణంలో భాగంగా కరకట్ట నిర్మించాలని అధికారులు భావించారు. ఇందుకోసం తాలిపేరు ప్రాజెక్టు నుంచి 40 లక్షల ఘనపు మీటర్ల మట్టిని తీయడానికి ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
కానీ పర్యావరణ అనుమతులు లేవని ఎన్జీటీ తేల్చి చెప్పడంతో ఆనకట్ట నిర్మాణ పనులు అర్థంతరంగా నిలిచిపోయాయి. దీంతో ఆనకట్ట పనులపై నీలినీడలు అలుముకున్నాయి. ఈ ఫలితంగా తాలిపేరు రిజర్వాయర్‌లో పూడిక పనులకు బ్రేక్ పడింది.
5 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం..
అర టీఎంసీ కెపాసిటీ ఉన్న తాలిపేరు రిజర్వాయర్‌లోకి వర్షాకాలం భారీగా వరద వచ్చి చేరుతుంది. ఈ ప్రాజెక్టు నుంచి ఏడాది పొడవునా 5 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం ఉంది. కానీ పూడిక పేరుకుపోవడం వల్ల కేవలం 2.50 టీఎంసీలు మాత్రమే వాడుకునే పరిస్థితి ఏర్పడింది.
రిజర్వాయర్‌లో సిల్లెవల్ 69 మీటర్ల పైనుంచి వచ్చే మట్టి గేట్ల ద్వారా కొట్టుకుపోతుంది. కానీ కుడి, ఎడమ కాల్వల హెడ్ రెగ్యులేటర్ల వైపు ఉన్న పూడికను తొలగిస్తే నీటి నిల్వ సామర్థ్యం పెంచుకునే అవకాశం ఉంది.
పూడికతీతకు ప్రత్యేకంగా నిధులు ఉండవు..
తాలిపేరు రిజర్వాయర్‌లో పూడికతీతకు ప్రత్యేకంగా నిధులంటూ ఏమీ ఉండవు. అయినా గేట్ల ద్వారా పైనుంచి వచ్చే మట్టి కొట్టుకుపోతుంది. రెండేళ్ల క్రితం సీతమ్మసాగర్ ఆనకట్టలో కరకట్టల కోసం 40 లక్షల ఘనపు మీటర్ల మట్టిని రిజర్వాయర్‌నుంచి తీయడానికి ప్రపోజల్స్ సిద్ధం చేశాం. వివిధ కారణాలతో ఆ పనులు ఆగిపోవడంతో మట్టి తీయలేదు. అయినా రైతులకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నాం.
- తిరుపతి, డీఈ, తాలిపేరు ప్రాజెక్టు
