నిమ్స్‌లో కోవ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ నిలిపివేత

నిమ్స్‌లో కోవ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ నిలిపివేత

హైదరాబాద్: కరోనా వైరస్‌ను నిలువరించడానికి వ్యాక్సిన్ తయారీ చేయడంలో అన్ని దేశాలు నిమగ్నమైన సంగతి తెలిసిందే. ఇండియాలో కూడా వ్యాక్సిన్‌ను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని కృషి చేస్తున్నారు. భారత్ బయోటెక్ డెవలప్ చేస్తున్న కోవ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్‌ దశలో ఉన్న విషయం విధితమే. ట్రయల్స్ కోసం ఎంపిక చేసిన దేశంలోని 12 సెంటర్స్‌లో హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో కూడా ఉంది. అయితే నిమ్స్‌లో నిర్వహిస్తున్న ట్రయల్స్‌కు బ్రేక్ పడింది. ఈ ఆస్పత్రిలో అవసరమైన ఎక్విప్‌మెంట్, సరైన సదుపాయాలు లేకపోవడంతో ట్రయల్స్‌ను నిలిపివేశారని తెలిసింది. క్యాండిడేట్స్‌ హెల్త్‌ సేఫ్టీ దృష్ట్యా ట్రయల్స్‌ను ఆపేశారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మరో రెండు నుంచి మూడు రోజుల్లో తిరిగి ట్రయల్స్ మొదలుపెడతారని సమాచారం.

‘మనుషుల మీద క్లినికల్ ట్రయల్స్ మొదలయ్యాయి. డ్రగ్‌ను ఇచ్చే ముందు కొన్ని పనులు జరగాల్సి ఉంది. అలాగే పలు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంది. దీనికి కొంత సమయం పట్టొచ్చు. ఇవి మొదట్లో ఉండే కొన్ని మామూలు ఇబ్బందులే. క్యాండిడేట్స్‌ ఆరోగ్యానికి మేం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆలస్యానికి కారణమైన ఎక్విప్‌మెంట్స్‌ బెస్ట్‌గా ఉండాలన్నదే మా ఉద్దేశం’ అని నిమ్స్‌లోని ఓ సీనియర్ అధికారి చెప్పారు. ట్రయల్స్‌ కోసం కొంత మందిని ఎంపిక చేశామని సదరు అధికారి పేర్కొన్నారు. దేశంలోని మొత్తం 12 సెంటర్స్‌లో నిర్వహిస్తున్న క్లినికల్ ట్రయల్స్‌లో 375 మందిపై మొదటి డోస్‌ను టెస్ట్‌ చేయనున్నారు. నిమ్స్‌లో 60 మందిపై ట్రయల్స్‌ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.