హర్యానా అల్లర్లతో ఢిల్లీలో హైఅలర్ట్

హర్యానా అల్లర్లతో ఢిల్లీలో హైఅలర్ట్

హర్యానా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. హింసాత్మక ఘటనలు నూహ్ నుంచి గురుగ్రామ్ వరకు విస్తరించాయి. దేశ రాజధాని ఢిల్లీ నగర శివార్లలోని సున్నిత ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. సాయుధ దళాలు నగర వీధుల్లో కవాతు నిర్వహించాయి. నోయిడాలో వీహెచ్ పీ భారీ నిరసన ప్రదర్శన నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలు సహా అన్నికీలక ప్రాంతాల్లో డ్రోన్ సర్వే చేస్తున్నారు. రూమర్లను నమ్మవద్దని, ఏదైనా సహాయం అవసరమైతే 112 కి డయల్ చేయాలని పోలీసులు పౌరులను కోరుతున్నారు. మరోవైపు ఢిల్లీ శివార్లలోని వివిధ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాలని కోరాయి. 

 గత రెండు రోజుల్లో ఐదుగురు మృతి 
గత రెండు రోజులుగా హర్యానాలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనల్లో ఇద్దరు హర్యానా హోం గార్డులతో సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులకు హర్యానా ప్రభుత్వం రూ.59 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ ఘర్షణల్లో చాలా మంది గాయాల పాలయ్యారు. విశ్వ హిందూ పరిషత్ చేపట్టిన యాత్ర సందర్భంగా ఈ ఘర్షణలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం నోయిడాలో మరోసారి భారీ యాత్ర చేపట్టాలని వీహెచ్పీ నిర్ణయించింది. సెక్టార్ 21 ఏ లోని నోయిడా స్టేడియం నుంచి రజని గంధా చౌక్ వరకు ఈ యాత్ర ఉంటుందని వీహెచ్పీ ప్రకటించింది. 

గురుగ్రామ్ - సోహ్నా రోడ్డులోని బాద్షాపూర్, పటౌడీ చౌక్, నుహ్, ఫరీదాబాద్, పాల్వాల్, గురుగ్రామ్, నోయిడా.. తదితర ప్రాంతాల్లో మళ్లీ హింస చోటు చేసుకునే అవకాశముందన్న నేపథ్యంలో.. పోలీసులు ఆయా ప్రాంతాల్లో గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. హరియాణాలో హింసాత్మక ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు 44 కేసులను నమోదు చేశారు. 70 మందికి పైగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు.