హర్యానాలో హై అలర్ట్

హర్యానాలో హై అలర్ట్

గురుగ్రామ్​కు పాకిన అల్లర్లు
ఐదుకు చేరిన మృతుల సంఖ్య
నూహ్​తో పాటు పలు జిల్లాల్లో కర్ఫ్యూ

హర్యానాలో అల్లర్లు కొనసాగు తున్నాయి. మంగళవారం గురుగ్రామ్​కు వ్యాపించాయి. ఈ ఘర్షణల్లో ఐదుగురు చనిపోగా 70 మందికి పైగా గాయపడ్డారు. అధికారులు ఇంటర్​నెట్​ను నిలిపివేశారు. 120 వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు.
గురుగ్రామ్‌‌‌‌/చండీగఢ్: హర్యానాలో రెండు వర్గాల మధ్య చెలరేగిన అల్లర్లతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. నూహ్ జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ కొనసాగుతున్నది. మంగళవారం నుహ్ కు పక్కనే ఉన్న గురుగ్రామ్​కు కూడా అల్లర్లు వ్యాపించాయి. ఈ ఘర్షణల్లో మృతుల సంఖ్య ఐదుకు పెరిగింది. 70 మందికి పైగా గాయపడ్డారు. సోమవారం అర్ధరాత్రి సెక్టార్ 57లో అల్లర్లు చెలరేగాయి. ప్రార్థన మందిరాలే లక్ష్యంగా ఆందోళనకారులు రాళ్ల దాడులకు తెగబడ్డారు. సోమవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు హోం గార్డులు మృతి చెందగా.. రాత్రి జరిగిన ఘర్షణలో మరో ఇద్దరు చనిపోయారు. గురుగ్రామ్ సెక్టార్ 57లోని అంజుమ్​ మసీదుపై ఓ వర్గానికి చెందిన కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హాస్పిటల్​కు తరలించగా.. 26 ఏండ్ల నాయబ్ ఇమామ్ చనిపోయాడు. దీంతో మృతుల సంఖ్య ఐదుకు పెరిగింది. పుకార్ల వ్యాప్తిని అడ్డుకునేందుకు బుధవారం వరకు నూహ్, ఫరీదాబాద్​లలో ఇంటర్నెట్ సేవలు హర్యానా ప్రభుత్వం నిలిపివేసింది. నూహ్‌‌‌‌ ఘర్షణల ప్రభావం పక్కనున్న గురుగ్రామ్‌‌‌‌పై పడటంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భారీగా పోలీసులను మోహరించింది.
120 వాహనాలు బుగ్గి
నూహ్​లో జరిగిన అల్లర్ల కారణంగా 10 మంది పోలీసులు గాయపడ్డారని వివరించారు. జిల్లా వ్యాప్తంగా 11 ఎఫ్ఐఆర్​లు రిజిస్టర్ చేశామని తెలిపారు. 27 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. మొత్తం 120 వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారని తెలిపారు. పారా మిలటరీ బలగాలను రంగంలోకి దించినట్లు వివరించారు. నూహ్, సోహ్నా ఏరియాల్లో టెన్షన్ వాతావరణం ఉందన్నారు. ఈ సందర్భంగా మంగళవారం పోలీసులు ఫ్లాగ్ మార్చ్​ చేపట్టారు. సంయమనం పాటించాలని సూచించారు. పుకార్లు నమ్మొద్దని తెలిపారు. అదేవిధంగా, పీస్ కమిటీ మీటింగ్​లు ఏర్పాటు చేశారు. 

గురుగ్రామ్​లో రెస్టారెంట్​కు నిప్పు
కొన్ని చోట్ల కర్ఫ్యూని లెక్క చేయకుండా ఇరువర్గాల వారు రోడ్ల పైకి వచ్చి దాడులకు పాల్పడుతున్నా రు. గురుగ్రామ్ బాద్‌‌‌‌షాపు ర్‌‌‌‌లో 200 మందితో కూడిన గుంపు మంగళవారం మధ్యాహ్నంలో కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడింది. ఓ రెస్టారెంట్​కు దుండగులు నిప్పంటించారు.