ఖలిస్థానీ మద్దతుదారులకు ఘాటు రిప్లై ఇచ్చిన హైకమిషన్ స్టాఫ్

ఖలిస్థానీ మద్దతుదారులకు ఘాటు రిప్లై ఇచ్చిన హైకమిషన్ స్టాఫ్

న్యూఢిల్లీ/లండన్: లండన్​లోని ఇండియన్ హై కమిషన్ ఆఫీస్​పై ఎగురుతున్న జాతీయ జెండాను ఖలిస్థానీ వేర్పాటువాదులు కిందికి దించేసి అగౌరవపరిచారు. హైకమిషన్​ సిబ్బంది జెండాను వారి చేతుల్లో నుంచి లాక్కుని భద్రపరిచారు. ఖలిస్థానీ వేర్పాటువాదులకు చెంపపెట్టులా అతి పెద్ద మూడు రంగుల జెండాను హైకమిషన్​ ఆఫీస్​పై అమర్చారు. లండన్‌‌లోని ఇండియా హౌస్‌‌పై ఉన్న ఈ భారీ జాతీయ జెండా ఫొటో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్‌‌ అవుతోంది. ట్విట్టర్ లో ఈ ఫొటోను షేర్​ చేసిన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ ‘జెండా ఊంచా రహే హమారా’ అంటూ కామెంట్​ పెట్టారు. జాతీయ జెండాను అగౌరవపరిచేందుకు ప్రయత్నించినవారిపై బ్రిటన్​ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. కాగా, ఖలిస్తానీ మద్దతుదారుడు జాతీయ జెండాను కిందకు లాగుతున్న వీడియో వైరల్ కావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మనదేశం.. ఢిల్లీలోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ను వివరణ కోరింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని స్కాట్లాండ్​ యార్డ్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయని, దీనిపై ఇన్వెస్టిగేషన్​ మొలైందని చెప్పారు. ఇండియన్​ హైకమిషన్​ దగ్గర సెక్యూరిటీని పెంచుతామని, ఇలాంటి ఘటనపై కఠినంగా వ్యవహరిస్తామని బ్రిటన్ అధికారులు తెలిపారు.

శాన్​ఫ్రాన్సిస్కోలోనూ..

వాషింగ్టన్: అమెరికా శాన్​ఫ్రాన్సిస్కోలోని ఇండియన్​ కాన్సులేట్​పై కూడా ఖలిస్థానీ మద్దతుదారులు ఆదివారం రాత్రి దాడికి పాల్పడ్డారు. సెక్యూరిటీ బారికేడ్లను దాటుకుంటూ.. ఖలిస్థాన్​కు మద్దతుగా నినాదాలు చేస్తూ పలువురు ఇండియన్​ కాన్సులేట్​లోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. రాడ్లు, కర్రలతో బిల్డింగ్ తలుపులు, కిటికీలను బద్దలుకొట్టారు. కాన్సులేట్​ ఆవరణలో రెండు ఖలిస్థానీ జెండాలను ఎగరేశారు. అయితే వీటిని అక్కడి సిబ్బంది వెంటనే తొలగించారు. ఈ దాడిని అమెరికాలోని ఇండియన్లు తీవ్రంగా ఖండించారు. కాన్సులేట్​పై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.