టీఎస్​పీఎస్సీ పేపర్ల లీక్ దర్యాప్తుపై హైకోర్టు ఆగ్రహం

 టీఎస్​పీఎస్సీ పేపర్ల లీక్  దర్యాప్తుపై హైకోర్టు ఆగ్రహం
  • రాత్రింబవళ్లు చదివి రాసిన పరీక్ష రద్దు చేస్తే ఎంత కష్టంగా ఉంటది
  • పరీక్షలు రాస్తున్న కమిషన్​సిబ్బందికి కీలక బాధ్యతలెట్లిస్తరు?
  • రాజకీయ నేతల నుంచి సిట్ ఏం ఇన్ఫర్మేషన్​ రాబట్టింది?


హైదరాబాద్, వెలుగు:టీఎస్‌‌‌‌‌‌పీఎస్సీ పరీక్షలు రాసిన వాళ్లలో మన ఫ్యామిలీ మెంబర్స్‌‌‌‌ ఉంటే పేపర్‌‌‌‌ లీకేజీ వల్ల ఎంత బాధ ఉంటుందో తెలుస్తుందని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. రాత్రింబవళ్లు చదివి పరీక్షలు రాశాక వాటిని రద్దు చేశారంటే మళ్లీ ఆ పరీక్షలు రాయాలంటే ఎంత కష్టంగా ఉంటుందోనని ఆవేదనను వ్యక్తం చేసింది. పేపర్‌‌‌‌ లీకేజీ జరిగి నెలన్నర అయినా ఇప్పటి వరకు నిందితులను బయటపెట్టలేదా అని ప్రశినించింది. పరీక్షలకు అనుమతి ఇచ్చిన సర్వీస్‌‌‌‌ కమిషన్‌‌‌‌లో పనిచేసే ఉద్యోగులకు కీలక బాధ్యతలను ఎలా అప్పగిస్తారని నిలదీసింది. పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారంపై సిట్‌‌‌‌ దర్యాప్తును సీబీఐకి బదలాయించాలా, లేక సిట్‌‌‌‌ టీంలోని మెంబర్స్‌‌‌‌ను మార్చాలా అన్న దానిపై ఈ నెల 28న జరిగే విచారణలో ఉత్తర్వులు చేసే జారీ అంశాన్ని పరిశీలిస్తామని ప్రకటించింది. సిట్‌‌‌‌లో మెంబర్స్‌‌‌‌ గురించి ఆరా తీసింది. వాళ్ల టెక్నికల్‌‌‌‌ నాలెడ్జ్​పై ప్రశ్నించింది. సిట్‌‌‌‌ రాజకీయ పార్టీలకు చెందిన నేతల నుంచి సీఆర్‌‌‌‌పీసీలోని 161 సెక్షన్‌‌‌‌ కింద స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఎందుకు రికార్డు చేశారని ప్రశ్నించింది. రాజకీయంగా నేతలు ఎన్నో మాట్లాడుతుంటారని, అది రాజకీయాల్లో భాగమని అభిప్రాయపడింది. ఇంతకీ సిట్‌‌‌‌ ఆ నేతల నుంచి ఏమైనా ఇన్​ఫర్మేషన్‌‌‌‌ రాబట్టిందా అని ప్రశ్నించింది. టీఎస్‌‌‌‌పీఎస్సీ పరీక్షల లీకేజీపై సిట్‌‌‌‌ గతంలోని రిపోర్టు, తాజాగా ఇచ్చిన అదనపు రిపోర్టులను పరిశీలించాక ఈ నెల 28న ఉత్తర్వులు జారీ చేస్తామని వెల్లడించింది.

ఇంత సమయం ఎందుకు? 

తెలంగాణ పబ్లిక్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ కమిషన్‌‌‌‌ పరీక్షల లీకేజీపై సిట్‌‌‌‌ దర్యాప్తు ఏకపక్షంగా జరుగుతోందని,  దీనిని సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌ను జస్టిస్‌‌‌‌ బి.విజయ్‌‌‌‌సేన్‌‌‌‌రెడ్డి సోమవారం విచారణ జరిపారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తి  ప్రభుత్వానికి, సర్వీస్‌‌‌‌ కమిషన్‌‌‌‌కు పలు ప్రశ్నలు సంధించారు. ఈ దశలో సిట్‌‌‌‌ పోలీసుల దర్యాప్తును శంకించలేమని, టెక్నికల్‌‌‌‌ ఎక్స్​పీరియన్స్‌‌‌‌ కొందరికి ఉండవచ్చునని, కొందరు శిక్షణ పొందవచ్చునని హైకోర్టు వ్యాఖ్యానించింది.  ఒక ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో బాధ్యులను గుర్తించేందుకు ఇంత సమయం అవసరమా అని ప్రశ్నించింది. ఇంత సమయం ఎందుకని కూడా ప్రశ్నించింది. డిపార్ట్‌‌‌‌మెంటల్‌‌‌‌గా విచారణ చేసే సామర్థ్యం ఉందా అని కూడా నిలదీసింది. పరీక్షలు రాసిన వాళ్లల్లో మన పిల్లలు ఉంటే ఆ బాధ తెలిసివచ్చేదని వ్యాఖ్య చేసింది. పరీక్షల వాయిదా వల్ల ఎంతమంది విద్యార్థులు, తల్లిదండ్రులు బాధపడి ఉంటారో అర్థం చేసుకోవాలని హితవు చెప్పింది. లీక్‌‌‌‌ అయిన పరీక్షలను రద్దు చేయడం, కొన్ని పరీక్షలను వాయిదా వేయడం సబేనని చెప్పింది.

20 మంది నిందితుల్ని గుర్తించాం

ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్‌‌‌‌ ప్రసాద్‌‌‌‌ వాదిస్తూ, 12 కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నామని, సిట్‌‌‌‌లో సైబర్‌‌‌‌ నేరాలపై దర్యాప్తు చేసే నిపుణులు ఉన్నారని చెప్పారు. 40 మంది సాక్షులను, 20 మంది నిందితులను గుర్తించామని, మరో ఇద్దరి అరెస్టుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. రూ.31.45 లక్షలు వసూళ్లు జరిగాయని, కొంత డబ్బు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నాలుగు పరీక్షలను రద్దు చేశామని, నాలుగు పరీక్షలను వాయిదా వేశామని కమిషన్‌‌‌‌ లాయర్‌‌‌‌ రాంగోపాల్‌‌‌‌రావు చెప్పారు. 25 వేల మంది పరీక్షలు రాశారని, సిట్‌‌‌‌ దర్యాప్తును అడ్డుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.

అభ్యర్థుల మార్కులు మంత్రి ఎలా చెప్పారు?

పిటిషనర్‌‌‌‌ తరఫున సీనియర్‌‌‌‌ అడ్వకేట్‌‌‌‌ వివేక్‌‌‌‌ ఠంకా వాదిస్తూ, కమిషన్‌‌‌‌లో ఇద్దరే మెంబర్స్‌‌‌‌ ఉన్నారంటూ మంత్రి కేటీఆర్‌‌‌‌ అనేక విషయాలను మీడియాకు వెల్లడించారని చెప్పారు. ఇద్దరే ఉండటం వల్ల లీక్‌‌‌‌ అయ్యాయని మంత్రి చెప్పారని, ఎంతమంది పరీక్షలు రాసిందీ, ఏ ప్రాంతం వాళ్లకు ఎన్ని మార్కులు వచ్చాయి.. వంటి విషయాలను మంత్రి ఎలా చెబుతారని ప్రశ్నించారు. పబ్లిక్‌‌‌‌లో లేని విషయాలను ఆయన ఎలా వెల్లడిస్తారని అడిడారు. ఒకే కంప్యూటర్‌‌‌‌ను సిట్‌‌‌‌ స్వాధీనం చేసుకుందన్నారు. 837 పోస్టులకు మార్చి 5న నిర్వహించిన ఎగ్జామ్‌‌‌‌ను రద్దు చేశారని, సిట్‌‌‌‌ నివేదికను పరిశీలించిన తర్వాత మరో మూడు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు టీఎస్‌‌‌‌పీఎస్సీ ఎలా ప్రకటిస్తుందని నిలదీశారు. టీఎస్‌‌‌‌పీఎస్‌‌‌‌కి సిట్‌‌‌‌ నివేదికను ఎలా ఇస్తుందని అడిగారు. నిందితుల వాంగ్మూలాల ఆధారంగానే సిట్‌‌‌‌దర్యాప్తు జరుగుతోందన్నారు. కమిషన్‌‌‌‌ సభ్యుల అర్హతపై ఇదే హైకోర్టులో పిల్‌‌‌‌ పెండింగ్‌‌‌‌లో ఉందని, తొలి అరెస్టు నిందితుడ్ని సిట్‌‌‌‌ కస్టడీ కోరలేదంటే సిట్‌‌‌‌ దర్యాప్తు ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని చెప్పారు. ఇతర దేశాల్లోని వ్యక్తులకు కూడా లీకేజీ వ్యవహారంలో పాత్ర ఉందని, అందుకే దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని కోరుతున్నట్లు వివరించారు. ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌ఐలు కూడా పరీక్షలు రాశారని, 30 లక్షల మందితో ముడిపడిన పరీక్షల వ్యవహారంలో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సీబీఐకి ఇవ్వాలన్నారు. అవినీతి కూడా చోటు చేసుకుందని, భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారాయని చెప్పారు. బాధితుల్లో 80% పేద, మధ్య తరగతి వాళ్లేనని చెప్పారు.