
హైదరాబాద్‌లో అభివృద్ధి పనులపై సర్కారుకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, వెలుగు: టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిపై పనులు ఎలా ఇస్తున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులిచ్చింది. ప్రతివాదులైన వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ, విజిలెన్స్ కమిషనర్, అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్‌ను కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను నవంబర్ 18వ తేదీకి వాయిదా వేసింది. హైదరాబాద్‌కు దగ్గర్లో పలు అభివృద్ధి పనులకు టెండర్లను ఆహ్వానించకుండా నామినేషన్‌పై చేయడాన్ని తప్పుపడుతూ ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ ప్రెసిడెంట్ సయ్యద్ నవీదుద్దీన్ పిల్ దాఖలు చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డిల డివిజన్ బెంచ్ ఈ పిల్‌ను ఇటీవల విచారించింది. టెండర్లు లేకుండా పనులు చేయడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి ఉందని, దీనిపై ఏసీబీ, విజిలెన్స్‌ల దర్యాప్తునకు ఆదేశించాలని పిటిషనర్ కోరారు. గాంధీ ఆస్పత్రిలో సివిల్ వర్క్స్, వికారాబాద్‌లోని శానిటోరియం, టీబీ హాస్పటల్ మరమ్మతులు, వంద పడకల ఆస్పత్రి అప్‌గేడేషన్ వర్క్స్, కొండాపూర్ ఏరియాలో ఆస్పత్రిలో న్యూ బ్లడ్ బ్యాంక్ బిల్డింగ్ నిర్మాణం, ఘట్‌కేసర్‌లో రూ.50 లక్షలతో సబ్ రిజి స్ట్రార్ ఆఫీసు నిర్మాణ పనులను టెండర్ లేకుండా, తమకు కావాల్సిన వారికి నామినేషన్ పద్ధతిపై ఇచ్చారని కోర్టుకు పిటిషనర్ తెలిపారు. దీనిపై ఏసీబీ, విజిలెన్స్ విచారణకు ఆదేశించాలని అధికారులకు విజ్ఞప్తి చేసినా, నోటీసు ఇచ్చినా స్పందించలేదన్నారు.
For More News..