ఇద్దరు హైకోర్టు జడ్జిల బదిలీ .. 28కి తగ్గిన న్యాయమూర్తుల సంఖ్య

ఇద్దరు హైకోర్టు జడ్జిల బదిలీ .. 28కి తగ్గిన న్యాయమూర్తుల సంఖ్య
  • సీజే అధ్యక్షతన ఫస్ట్‌‌‌‌ కోర్టు హాల్లో వీడ్కోలు సమావేశం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తులుగా చేస్తున్న ఇద్దరు జడ్జిలకు సోమవారం హైకోర్టు వీడ్కోలు చెప్పింది. ఫస్ట్‌‌‌‌ కోర్టు హాల్లో చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ అలోక్‌‌‌‌ అరాధే అధ్యక్షతన సోమవారం వీడ్కోలు సమావేశం జరిగింది. రాజస్థాన్‌‌‌‌, పట్నా హైకోర్టులకు బదిలీ అయిన జస్టిస్‌‌‌‌ మున్నూరి లక్ష్మణ్, జస్టిస్‌‌‌‌ జి.అనుపమ చక్రవర్తి అందించిన న్యాయసేవలను సీజే గుర్తుచేశారు. ఈ సందర్భంగా తమకు సహకరించిన వారందరికీ ఆ ఇద్దరు జడ్జిలు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బార్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ నర్సింహారెడ్డి, అదనపు సొలిసిటర్‌‌‌‌ జనరల్‌‌‌‌ నరసింహశర్మ, డిప్యూటీ సొలిసిటర్‌‌‌‌ జనరల్‌‌‌‌ ప్రవీణ్‌‌‌‌ కుమార్, పీపీ రాజేందర్‌‌‌‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తర్వాత హైకోర్టు బార్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ అధ్యక్షుడు పి.నాగేశ్వర్‌‌‌‌రావు అధ్యక్షతన బార్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ కూడా ఇద్దరు జడ్జిలను సత్కరించింది. ఈ కార్యక్రమానికి సీనియర్‌‌‌‌ ఎగ్జిక్యూటివ్‌‌‌‌ కమిటీ మెంబర్‌‌‌‌ నాగులూరి కృష్ణ కుమార్‌‌‌‌ గౌడ్, ఇతర నేతలు బైరెడ్డి శ్రీనివాస్, శ్రీనివాస్‌‌‌‌ కాళ్లకూరి, చైతన్య లత, కటకం శారద, బొడిగల, శారద తదితరులు హాజరయ్యారు. ఇద్దరు జడ్జిల బదిలీతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య మొత్తం 42కిగాను 28కి తగ్గింది. మరోవైపు, జస్టిస్‌‌‌‌ చిల్లకూరు సుమలత, జస్టిస్‌‌‌‌ ముమ్మినేని సుధీర్‌‌‌‌కుమార్‌‌‌‌ను బదిలీ చేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులు కేంద్రం వద్ద ఉన్నాయి.